శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా ఇప్పుడు అందరి కళ్లు విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. అదేంటనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోహ్లి తను ఆడబోయే వందో టెస్టులోనే సెంచరీ మార్క్‌ను అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బీసీసీఐ కూడా కోహ్లి సెంచరీ సాధిస్తే చూడాలని ఉందంటూ పేర్కొంది. కోహ్లి వందో టెస్టు కళ్లారా చూడాలన్న అభిమానుల కోరికను కూడా బీసీసీఐ మన్నించింది. 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లి.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
2014లో ఎంఎస్ ధోని నుంచి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న కోహ్లి జట్టను విజయపథంలో నడిపించాడు. టీమిండియా టెస్టు కెప్టెన్లలో అత్యధిక విజయాలు అందుకున్న నాయకుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను వారి సొంతగడ్డపై మట్టికరిపించి సిరీస్‌లు గెలిచి కెప్టెన్‌గా.. ఆటగాడిగా తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఆటగాడిగానూ కోహ్లి ప్రదర్శన అద్భుతమనే చెప్పొచ్చు. ఇప్పటివరకు 99 టెస్టుల్లో 7962 పరుగులు సాధించాడు. ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి.
కాగా కోహ్లి వందో టెస్టు ఆడనున్న నేపథ్యంలో బీసీసీఐ కోహ్లికి సంబంధించిన ఒక చిన్న వీడియోనూ రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కోహ్లి పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.” నేను వంద టెస్టు మ్యాచ్‌లు ఆడుతానని ఊహించలేదు. నా దృష్టిలో టెస్టు క్రికెట్ రియల్ క్రికెట్.. క్రికెట్‌లో అడుగుపెట్టే ముందే బ్యాట్స్‌మన్‌గా చిన్నస్కోర్లు చేయకూడదని భావించా. ప్రతీ మ్యాచ్‌లోనూ పెద్ద స్కోర్లు చేయాలనే ఆలోచన ఉండేది. టెస్టుల్లో అరంగేట్రం చేయడానికి ముందు జూనియర్ క్రికెట్‌లో 7-8 డబుల్ సెంచరీలు బాదాను. ఆ క్షణమే ఎంత వీలైతే అంత సుధీర్ఘ బ్యాటింగ్ చేయాలనుకున్నా.
టీమిండియాలోకి అడుగుపెట్టాకా అదే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించా. కొన్నిసార్లు సక్సెస్ అయితే.. మరికొన్ని సార్లు విఫలమయ్యా. ” అని చెప్పుకొచ్చాడు.ఇక కోహ్లి టీమిండియా తరపున వందో టెస్టు ఆడుతున్న 12వ ఆటగాడిగా నిలవనున్నాడు. సచిన్, ద్రవిడ్, గంగూలీ, సెహ్వాగ్ తదితరుల సరసన నిలవనున్నాడు. ఇక మరో 38 పరుగులు చేస్తే 8వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆరో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలవనున్నాడు.