Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఘనమైన గత చరిత్రకు వారసులమని చెప్పేందుకు ప్రతి ఒక్కరూ తహతహలాడతారు. ఆ చరిత్ర తనలో ఇముడ్చుకున్న మధురమైన గుర్తులను సాంస్కృతిక వారసత్వంగా స్వీకరిస్తారు. చరిత్ర వైభవాన్ని వర్తమానంలో నిలబెట్టేందుకు, కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతారు. అదే చరిత్ర… రక్తసిక్తమయినప్పుడు… శతాబ్దాలు గడిచినా చెరగని చేదుజ్ఞాపకాలకు సాక్షీభూతం అయినప్పుడు… ఆ చరిత్రకు వారసులమని చెప్పుకునేందుకు, ఆ తప్పులకు బాధ్యత వహించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రారు. నిజానికి చరిత్ర అంటేనే గతం.
వర్తమానంలో జీవించే వ్యక్తులకు ఆ చరిత్రలో ప్రత్యక్ష ప్రమేయముండదు. చరిత్ర తాలూకూ జ్ఞాపకాలు, దాని ఆధారంగా ఏర్పడే పరిణామాలను మాత్రమే వర్తమానంలో మనిషి విశ్లేషించగలడు. దాని ఆధారంగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలడు. కానీ వారు, వీరు అన్న తేడాలేకుండా అందరూ గత చరిత్ర గొప్పతనాన్ని తమదిగా భావిస్తారు. అదే సమయంలో జరిగిన తప్పుల్ని మాత్రం అప్పటి వ్యక్తులకు ఆపాదిస్తారు. అయితే సమాజం మాత్రం అలా చూడదు. చరిత్రను తలచుకుని తాము గొప్పవాళ్లమని భావించే వాళ్లనే ఆ చరిత్రలో జరిగిన తప్పులకు బాధ్యులను చేస్తుంది. ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా ఇదే పరిస్థితి ఉంటుంది.
యూదులకు వ్యతిరేకంగా హిట్లర్ నేతృత్వంలో మారణకాండ సాగించిన నాజీలు తర్వాత కాలంలో… అనేక చెడ్డ అనుభవాలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ జర్మనీలో చాలా మంది నాజీలమని చెప్పుకోడానికి భయపడుతుంటారు. ప్రస్తుతమున్న నాజీలకు, హిట్లర్ కాలంలో జరిగిన మారణకాండకు ఎలాంటి సంబంధం లేకపోయినా… నాజీలను జర్మనీ సమాజం ఆ కోణంలోనే చూస్తుంది. అలాగే… ఇతర దేశాల నుంచి వలస వచ్చి… అక్కడున్నస్థానికులను బానిసలుగా మార్చుకుని అమెరికాను బానిసల దేశంగా మార్చిన శ్వేతజాతీయులపై ఆనాటి ఘటనలు తలచుకుంటే… ఏహ్యభావమే కలుగుతుంది.
అమెరికాలోని ఇప్పటి తరం శ్వేతజాతీయులెవరూ బానిసత్వం వంటి దారుణాలకు పాల్పడలేదు. కానీ… వారి తాత, ముత్తాతలు అమలు చేసిన బానిసత్వ విధానాలకు ఇప్పటివారిని కూడా దోషులుగానే చూస్తారు నల్లజాతీయులు. ఇక రవి అస్తమించని సామ్రాజ్యంగా ప్రపంచ దేశాలను ఏలిన బ్రిటన్ గత చరిత్ర అంతా పాపాలమూటే. అందుకే కామన్ వెల్త్ దేశాల్లో ఇంగ్లండ్ అంటే ఒకరకమైన వ్యతిరేకభావం ఉంటుంది. ఆధునిక చరిత్రలో మిత్రదేశాలు, శతృదేశాలు అంటూ కొత్త జాబితా తయారయినా… కామన్ వెల్త్ దేశాల్లో ఏదో ఒక సందర్బంలో ఇంగ్లండ్ ను మనసులోనైనానా తిట్టుకోని పౌరులుండరంటే… అతిశయోక్తి కాదు. ఎందుకంటే బ్రిటిషర్లు తమ పరిపాలనలో చేసిన తప్పులకు ఫలితాలను ఆయా దేశాల్లోని ఇప్పటితరం అనుభవిస్తోంది. అందుకే ఇప్పటి ఇంగ్లండ్ పౌరులకు ఆ ఘటనలతో సంబంధం లేకపోయినా… మన దృష్టిలో వాళ్లంతా దోషులే. మనదేశం సహా కామన్ వెల్త్ దేశాల్లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సాగించిన దారుణాలు వర్ణించడానికి మాటలు చాలవు.
అలాంటి ఒక దారుణమే 98 ఏళ్ల క్రితం పంజాబ్ లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటన. 1919 ఏప్రిల్ 13… గాంధీ నేతృత్వంలో స్వతంత్ర ఉద్యమం సాగుతున్న రోజులు. గాంధీజీ పిలుపునిచ్చిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నందుకు సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూ అనే ఇద్దరు నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. వారి అరెస్టును ఖండించడానికి ఏర్పాటు చేసిన సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమావేశాన్ని చూసి ఓర్వలేక అప్పటి జనరల్ డయ్యర్ కాల్పులకు ఆదేశించాడు. ఆయన ఆదేశాల మేరకు భద్రతాదళాలు బయటికి వెళ్లే దారులన్నింటినీ మూసివేసి… కాల్పులకు తెగబడ్డాయి. నిరాయుధులైన ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. మందుగుండు సామాగ్రి అంతా అయిపోయాకే కాల్పులు ఆగాయి. ఈ దారుణంలో అధికారిక లెక్కల ప్రకారం 379 మంది మరణించారని, 1200 మంది గాయపడ్డారని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి వెయ్యిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 1500 మంది గాయపడ్డారని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలిపింది. ఈ దారుణం భారత స్వాతంత్ర ఉద్యమాన్ని మలుపుతిప్పింది.
బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశప్రజలంతా స్వచ్ఛందంగా స్వంతంత్రం కోసం పోరాడేందుకు తరలివచ్చారు. జనరల్ డయ్యర్ ను 21 ఏళ్ల తరువాత ఉద్దమ్ సింగ్ అనే విప్లవకారుడు లండన్ లో కాల్చిచంపారు. జలియన్ వాలా బాగ్ దుర్ఘటన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ చరిత్రలో చెరగని మచ్చ. అందుకే ఆ చేదు జ్జాపకానికి ఇప్పుడు క్షమాపణ చెప్పాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు ఓ భారత సంతతి ఎంపీ. వీరేంద్రశర్మ అనే ఎన్ ఆర్ ఐ ఎంపీ ఈ మేరకు బ్రిటన్ పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశపెట్టారు. భారత స్వతంత్ర పోరాటాన్ని మలుపుతిప్పిన జలియన్ వాలాబాగ్ ఘటనను బ్రిటన్ ప్రభుత్వం గుర్తించాలని, ప్రధాని థెరెసా మే క్షమాపణలు తెలియజేయాలని ఆయన తీర్మానంలో కోరారు.
2019 నాటికి ఈ దారుణం జరిగి వందేళ్లు అయిన సందర్భంగా… దీనిపై బ్రిటన్ ప్రజల్లో అవగాహన కలిగించాలని వీరేంద్ర శర్మ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానానికి మద్దతుగా ఐదుగురు బ్రిటన్ ఎంపీలు సంతకం చేశారు. తమ గత చరిత్ర గురించి ఘనంగా భావించే బ్రిటిష్ ప్రభుత్వం… వీరేంద్ర శర్మ కోరినట్టుగా అందులోని తప్పులకు బాధ్యత వహిస్తుందో లేదో చూడాలి. గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ మాత్రం ఈ విషయంలో హుందాగా వ్యవహరించారు. తన భారత పర్యటనలో కామెరూన్ జలియన్ వాలాబాగ్ దారుణాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బ్రిటిషర్లు చేసిన ఓ సిగ్గులేని చర్యగా దీన్ని అభివర్ణించారు. మరి ఆయన స్థానంలో బ్రిటన్ ప్రధాని అయిన ధెరెసా మే కూడా తమ పూర్వీకుల తప్పులకు బాధ్యత వహిస్తారో లేక… సంబంధం లేదని తప్పుకుంటారో కొన్నిరోజుల్లో తేలనుంది.