నిజంగా కమల్‌ విశ్వరూపమే…..!

viswaroopam Suspense trailer in Kamal Haasan

కమల్‌ హాసన్‌ నటించిన ‘విశ్వరూపం’ చిత్రం 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అప్పటి ప్రభుత్వం విశ్వరూపం విడుదలకు చాలా అడ్డంకులను సృష్టించింది అనే విమర్శలు ఉన్నాయి. కమల్‌ అప్పట్లో సినిమా విడుదల చేసేందుకు ఏకంగా కన్నీరు కూడా పెట్టుకున్నాడు. అంతటి వివాదంను రేపిన విశ్వరూపంకు సీక్వెల్‌గా వెంటనే కమల్‌ విశ్వరూపం 2ను చేసిన విషయం తెల్సిందే. ఆరు నెలల గ్యాప్‌లోనే రెండవ పార్ట్‌ను తీసుకు రావాలని కమల్‌ హాసన్‌ భావించాడు. ఆరు నెలలు కాస్త ఆరు సంవత్సరాలు అయ్యింది. ఎట్టకేలకు విశ్వరూపం 2 చిత్రం విడుదలకు మోక్షం దక్కింది. గత కొన్నాళ్లుగా అదుగో ఇదోగు అంటూ ఊరించిన ఈ చిత్రం తాజాగా ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 10న విడుదల కాబోతున్న విశ్వరూపం 2 చిత్రంలో కమల్‌ విశ్వరూపంను చూపించినట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

‘విశ్వరూపం’ చిత్రంతో పోల్చితే ఈ చిత్రంలో చాలా యాక్షన్‌ సీన్స్‌ ఉండబోతున్నట్లుగా అనిపిస్తున్నాయి. భారీ ఎత్తున యాక్షన్‌ సీన్స్‌తో పాటు కమల్‌ చాలా విభిన్నంగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. పలు గెటప్స్‌ మరియు హీరోయిన్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని అనిపిస్తుంది. ఈ చిత్రంలో కమల్‌ విలన్‌గా కనిపించబోతున్నాడా, హీరోగా కనిపిస్తాడా అనే విషయంలో మాత్రం ట్రైలర్‌ చూస్తుంటే సస్పెన్స్‌గా ఉంది. ఉగ్రవాదిగా కమల్‌ ఎందుకు మారుతాడు అనే విషయంపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని ట్రైలర్‌ కలిగింది. నటుడిగా యూనివర్శిల్‌ హీరో అంటూ గుర్తింపు దక్కించుకున్న కమల్‌ హాసన్‌ ఈ చిత్రంతో తన నటన విశ్వరూపంను చూపించి మరోసారి యూనివర్శిల్‌ స్టార్‌ అనే పేరును సార్థకం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. కమల్‌ హాసన్‌కు తెలుగులో కూడా భారీ క్రేజ్‌ ఉంది కనుక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా వివాదాల మద్య విడుదల అవుతున్న ఈ చిత్రం ఎంతటి విజయాన్ని దక్కించుకుంటుందో చూడాలి.