జమ్మలమడుగు బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వైఎస్ వివేకా హత్య కేసును విచారిస్తున్న సిట్ నోటీసులు పంపింది. విచారణకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాలని ఆయనకు తాఖీదులు పంపారు. నిజానికి వివేకా హత్య కేసులో ఆదినారాయణరెడ్డికి ఇప్పటికే మూడు సార్లు నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే వాటిని తీసుకునేందుకు ఆదినారాయణరెడ్డి నిరాకరించారు. దాంతో మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో మంత్రిగా చేసిన ఆదినారాయణరెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరారు.
ఈ ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో కడప జిల్లా నుంచి మంత్రిగా ఆదినారాయణరెడ్డి ఉన్నారు. మొదటగా గుండెపోటుగా చెప్పుకొచ్చిన వైసీపీ నేతలు హత్యగా నిర్ధారణ అయిన తర్వాత చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణల కుట్రఅంటూ ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో వ్యవహారం సద్దుమణిగింది. ఇటీవలి కాలంలో బాబాయ్ హత్య కేసును కూడా పరిష్కరించలేని ముఖ్యమంత్రి అని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తూండటంతో సిట్ విచారణలో వేగం పెంచింది.
టీడీపీ నేతల్ని ఇతర ఆరోపణలున్నవారికి నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తోంది. నిజానికి వైఎస్ వివేకా హత్య కేసు పెద్ద పజిల్ కాదని క్రైమ్ ను ఫాలో అయ్యే వారందరికీ అర్థమవుతుంది. సాక్ష్యాలు తుడిచేయాలనుకున్న వారితోనే క్లూ విడిపోతుందని క్రైమ్ సీరియళ్లు చూసేవారికి కూడా తెలిసిపోతుంది. అయితే.. పోలీసులు అసలు వ్యక్తుల్ని కాకుండా విచారణ ఎక్కడెక్కడో కొనసాగిస్తున్నారేనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు నిజాల కన్నా అవసరం లేని విషయాల్లో విచారణ జరుపుతున్నారనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ నేతలకు సిట్ నోటీసులు జారీ చేస్తూండటం.. వివాదాస్పదంగా మారుతోంది.