గతేడాది చివర్లో దేశీయ దిగ్గజ టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సుమారు 20 శాతం మేర టారిఫ్ ధరలను దిగ్గజ టెలికాం కంపెనీలు పెంచాయి. కాగా ఈ ఏడాదిలో వొడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలను మరోమారు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది నవంబర్లో పెరిగిన ధరల మార్కెట్ స్పందనపై టారిఫ్ల పెంపు ఆధారపడి ఉండే అవకాశం ఉందని వొడాఫోన్ ఐడియా సీఈఓ రవీందర్ టక్కర్ అభిప్రాయపడ్డారు.ఆయా టెలికాం సంస్థలు సగటు ఆదాయాలను పెంచుకునేందుకుగాను టారిఫ్ ధరలను పెంచాయి. ఈ క్రమంలో 2022లో కూడా టారిఫ్ ధరలు పెరగవచ్చునని అన్నారు.
టారిఫ్ రేటు పెరిగినందున సబ్స్క్రైబర్ బేస్ 26.98 కోట్ల నుంచి 24.72 కోట్లకు తగ్గింది. టారిఫ్ పెంపు ఉన్నప్పటికీ కంపెనీ సగటు యూజర్ ఆదాయం ఏఆర్పీయూ సుమారు 5 శాతం క్షీణించడం విశేషం. ఏఆర్పీయూ రూ. 115గా నమోదైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా మూడో త్రైమాసికంలో నష్టాలను చవిచూసింది.
వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను ఈక్విటీగా మార్చడం ద్వారా ఇన్వెస్టర్ల నుంచి సానుకూలంగా స్పందన ఉందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షయ ముంద్రా అన్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి వడ్డీ రూపంలో వెళ్లే రూ. 1,600 కోట్లను ఆదా అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని నెట్వర్క్ విస్తరణ కోసం ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. అలాగే, ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలోగా నిధుల సేకరణను పూర్తి చేయాలని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు.