భారీగా పెరుగుతున్న మొబైల్ రిచార్జ్ ధరలు

భారీగా పెరుగుతున్న మొబైల్ రిచార్జ్ ధరలు

దేశంలో ఒక్కసారిగా మొబైల్ రిచార్జ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఎయిర్‌టెల్ మొబైల్ కాల్, డేటా టారిఫ్‌ ధరలను భారీగా పెంచిన తేలిసిందే. ఇప్పుడు దేశంలోని మరొక టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ బాటలోనే నడించేందుకు సిద్దం అయ్యింది. నేడు ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా మొబైల్ కాల్, డేటా టారిఫ్ ధరలను 20-25 శాతం పెంచినట్లు ప్రకటించింది. నవంబర్ 25 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

ఫిక్సిడ్ బ్రాడ్ బ్యాండ్, మొబైల్ నెట్‌వర్క్ టెస్టింగ్ అప్లికేషన్స్ కంపెనీ ఊక్లా పేర్కొన్న విధంగా ఈ కొత్త టారిఫ్ ప్లాన్‌లు ‘భారతదేశంలో వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్ సేవలను అందించడం’ కోసం సహాయపడతాయని వొడాఫోన్ తెలిపింది. ప్రారంభ స్థాయి ప్లాన్‌ల ధరలను 25శాతం పెంచగా.. లిమిటెడ్‌ కేటగిరీ ప్లాన్‌ల ధరలను 20-23శాతం పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. పరిశ్రమ ఎదుర్కొంటోన్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో వినియోగదారుపై సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారతి ఎయిర్‌టెల్ టారిఫ్ ధరల ప్రకటించిన ఒక రోజు తరువాత వొడాఫోన్ ఐడియా ఈ ప్రకటన చేసింది. నవంబర్ 26 నుంచి అన్ని కొత్త ధరలు అమలులోకి రానున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది.