ఎంబ్రేర్ లీగసీ 600 ఎగ్జిక్యూటివ్ జెట్ వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ప్రయాణిస్తుండంగా ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే, ఈ విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్య ప్రమాదానికి 30 సెకన్ల ముందు వరకూ తలెత్తలేదని ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం తెలుస్తోంది. చివరి క్షణాల్లో ఆ విమానం ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం. పొగలు వెలువరిస్తూ విమానం వేగంగా కిందకు వచ్చి కూలిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
విమానం 28వేల అడుగుల ఎత్తులో ఉండగా.. ఒక్కసారిగా అక్కడి నుంచి ఎత్తు క్షణానికోసారి వేగంగా మారిపోయిందని ఈ డేటా తెలిపింది. ఒక దశలో 30వేల అడుగుల ఎత్తుకు వెళ్లిందని.. కేవలం 30 సెకన్లలోనే విమానం 28వేల అడుగుల ఎత్తు నుంచి 8వేల అడుగులకు పడిపోయిందని వెల్లడించింది. ఆ తర్వాత కొద్ది సెకన్లకే విమానం కుప్పకూలిందని పేర్కొంది.
ఫ్లైట్ రాడార్ 24 ప్రతినిధి పెట్చెనిక్ ఈ ప్రమాదం క్షణాల్లో జరిగిపోయిందని చెప్పారు. 30 సెకన్ల ముందు వరకు కూడా ఈ విమానంలో సమస్య ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు రాలేదని, విమానం ఉన్నట్టుండి నిలువుగా కిందకు వచ్చిందని తెలిపారు.