వామ్మో వీడి తెలివి….కూతురి వేషం వేసుకుని జంప్ అవ్వాలనుకున్నాడు !

clauvino-da-silva

డాన్‌ లలో డ్రగ్‌ మాఫియా డాన్‌ల రూటే సపరేటంటూ బ్రెజిల్‌లోని జైలులో ఉన్న ఓ డ్రగ్‌ మాఫియాడాన్‌కు ఓ ఐడియా వచ్చింది. అచ్చం తన టీనేజర్‌ కూతురులా రెడీ అయి జైలు నుంచి తప్పించుకోవాలనేది అతని ప్లాన్‌. కానీ చివరి నిమిషంలో అమ్మాయిలా నటించడంలో మాత్రం సక్సెస్‌ కాలేక అడ్డంగా బుక్కయ్యాడు.

42 సంవత్సరాల క్లౌవినో డ సిల్వా బ్రెజిల్‌ దేశంలో పేరుమోసిన డ్రగ్‌ మాఫియా నాయకుడు. ఇతడు ప్రస్తుతం రియోడిజెనిరో నగరంలోని సెంట్రల్‌ జైలులో 73 సంవత్సరాల కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికే రకరకాల ఎత్తులు వేసినా పారలేదు.

దీంతో ఏకంగా తన కూతురుని ఉపయోగించుకొని పారిపోవాలని భారీ స్కెచ్‌ వేశాడు. తనను కలవడానికి వచ్చిన 19 ఏళ్ల కూతురిని లోపలే ఉంచి అప్పటికే సిద్ధం చేసుకున్న టీషర్ట్‌, సిలికాన్‌మాస్క్‌, కళ్లజోడు, విగ్‌లతో అచ్చం కూతురిలా రెడీ అయి బయటకు వచ్చాడు.

పాపం జైలు ఆవరణలోని పోలీసులు కూడా ఇతన్ని చూసి అమ్మాయే అనుకొని పొరపాటుపడ్డారు. దీంతో గేటు వరకూ వచ్చాడు. దాదాపు బయటకు వెళ్లే సమయంలో గేటు దగ్గర చివరి తనిఖీల్లో భాగంగా పోలీసులు చెక్‌ చేస్తుండగా మనోడు అమ్మాయిలా మరీ మెలికలు తిరిగిపోయాడంటా.

దీంతో అనుమానం వచ్చిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి అవాక్కయ్యారు. అతడి ఒక్కొక్క మేకప్‌ తీయమని చెప్తూ వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇంతకీ ఇన్ని వస్తువులు ఎలా వచ్చాయబ్బా అని ఆరా తీయగా గర్భిణి వేషంలో అంతకుముందే ఓ మహిళ ఇతడిని కలిసి వెళ్లిందని తెలిసింది