Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరీ ముఖ్యంగా జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాకీయం కొత్త దారి తొక్కింది. లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెండింగ్ లో ఉండగానే దేశం అంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. ఎవరు ఎవరికి మిత్రులో , ఎవరు ఎవరికి శత్రువులో అర్ధం కాని పరిస్థితుల్లో ప్రస్తుతం ఏపీ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఈ వేడికి కారణం అయిన 2019 ఎన్నికలకు సంబంధించి మాత్రం ఓ స్పష్టత వచ్చేస్తోంది. 2009 మినహా ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో ముఖాముఖీ పోటీ జరిగింది. అయితే కొత్తగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ లో రెండో అసెంబ్లీ ఎన్నికలకే పంచ ముఖ పోటీ జరిగే అవకాశాలు సుస్పష్టంగా వున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రాలో రాజకీయ వాతావరణం ఎంత అస్పష్టంగా వుందో, 2019 ఎన్నికల చిత్రం అంత స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు nda నుంచి వైదొలిగి ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం పెట్టారో అప్పుడే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో అంటరాని పార్టీ అయిపోయింది. ఆ పార్టీ చెప్పినట్టు వినే నేతలు, పార్టీలు ఉన్నప్పటికీ తమతో పొత్తు పెట్టుకుంటే అందరూ కలిసి మునుగుతామని బీజేపీ కి కూడా తెలిసొచ్చింది. ఇక కిందటి ఎన్నికల్లో విభజన పాపంతో శరాఘాతం పాలైన కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకొంటోంది. బీజేపీ వ్యవహారశైలితో పోల్చుకుని దీనికన్నా కాంగ్రెస్ మేలన్న అభిప్రాయం జనాల్లో కలుగుతోంది. అయితే కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు అంటే విభజన పాపాన్ని మోయాల్సివుంటుంది. అందుకే ఎన్నికల తర్వాత టీడీపీ లాంటి పార్టీలు పరోక్ష పొత్తుకు ఎస్ అనొచ్చేమో గానీ ముందుగా ఏ ఒక్కరు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయరు. అంటే ఏపీ రాజకీయాల్లో రెండు జాతీయ పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగుతాయి. ఇక ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ కూడా ఒంటరి పోరుకే సిద్ధం. ఇక కొత్తగా బ్యాలెట్ బరిలోకి దిగుతున్న జనసేన వామపక్షాలతో కలిసి పోటీ చేయొచ్చు. ఆ విధంగా 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో టీడీపీ, వైసీపీ, జనసేన – వామపక్ష కూటమి, కాంగ్రెస్, బీజేపీ ఇలా మొత్తం 5 పార్టీలు తలపడబోతున్నాయి.