ఏపీ సర్కార్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య గత కొద్ది రోజులుగా జల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం కేసీఆర్, సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేసేందుకు నిన్న ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.
అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తామని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును గట్టిగా వ్యతిరేకించాలని అధికారులకు సూచించారు. నదీ జలాల వినియోగం విషయంలో తమ రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలను కూడా లేవనెత్తుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ, ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను సీఎం కేసీఆర్ కొట్టిపారేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం విషయం లో తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని, అజెండాలో చేర్చాల్సిన అంశాలను కూడా అందులో తెలుపుతామని అన్నారు.