Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ రెండూ అపార విశ్వాసంతో ఉన్నాయి. గెలుపు మాదంటే మాదంటూ పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకుంటుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తంచేస్తోంటే… బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప తన ప్రమాణస్వీకారం తేదీని కూడా ప్రకటించి… కాంగ్రెస్ పై ఎదురుదాడికి దిగుతున్నారు. ఓటింగ్ రోజు కూడా ఇరు పార్టీల నేతలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. మైసూర్ లోని సిద్ధరామహుండీలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కర్నాటకలో మోడీ హవా లేదని, కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. హంగ్ వచ్చే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ లభిస్తుందని సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. యడ్యూరప్పపై సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. యడ్యూరప్ప మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. బీజేపీకి 70 సీట్లకు మించి రావని, అధికారం కోసం బీజేపీ నేతలు కలలు కంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. అటు గెలుపుపై యడ్యూరప్ప పూర్తి విశ్వాసంతో ఉన్నారు.
బీజేపీ 140-150 స్థానాలు గెలుచుకుంటుందని యడ్యూరప్ప చెబుతున్నారు. శివమొగ్గ జిల్లాలోని శికార్ పూర్ లో ఓటువేసిన అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. తాను 50 వేల మెజారిటీతో విజయం సాధిస్తానని, ఈ నెల 17న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని… ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు హాజరవుతారని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. మొత్తానికి గెలుపు పై రెండు పార్టీలు విశ్వాసంతోనే ఉన్నా… ఏ పార్టీని విజయం వరిస్తుందో మే 15న తేలనుంది.