అమెరికాలో నేలరాలిన తెలుగు విద్యాకుసుమం !

Warangal student Sharath Koppu shot dead in US

అమెరికా లోని మిస్సోరి రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన కొప్పు శరత్‌(26) అనే విద్యార్థి మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం మిస్సోరిలోని కాన్సస్‌ నగరంలో ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని శరత్‌ను ఆసుపత్రికి తరలించినా… అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వరంగల్‌లోని కరీమాబాద్‌ ప్రాంతానికి చెందిన కొప్పు రామ్మోహన్, మాలతి దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు శరత్‌. కూతురు అక్షర. రామ్మోహన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం చేస్తుండగా, మాలతి పంచాయతీరాజ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

‘‘ఇద్దరు స్నేహితులతో కలిసి రాత్రి తినటానికి రెస్టారెంట్‌కు వెళ్ళాడు శరత్. అంతలోనే అక్కడకి కొందరు గుర్తుతెలియని దుండగులు వచ్చి ఆ  రెస్టారెంట్‌ లో  కాల్పులు జరిపారు. వెంటనే అక్కడ ఉన్న వారందరూ తప్పించుకుంటానికి ప్రయత్నించారు. శరత్‌తో ఉన్న ఇద్దరు తప్పించుకున్నారు. శరత్‌ కూడా పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ దుండగులు వెనుక నుంచి కాల్పులు జరపడంతో శరత్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. శరత్ పై ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు కెన్సాస్ పోలీసులు గుర్తించారు. కాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసులో నిందితుడిని గుర్తిస్తామని కెన్సాస్ పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న శరత్ కుటుంబ సభ్యులు తెలంగాణ డీజీపీని కలిసి శరత్ మృతి వివరాలు తెలుసుకోవాలని కోరారు.