చిన్నారిని రేప్ చేసిన వరంగల్ యువకుడికి మరణ శిక్ష !

Warangal youth sentenced to death for raping child

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన 9నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో వరంగల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 40 రోజుల్లోనే విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం అంతా ఆశించిన విధంగానే నిందితుడికి మరణ శిక్ష విధించింది. అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన కామాంధుడు అత్యాచారం చేసి ప్రాణాలు తీశాడు. 30కి పైగా సాక్షులను విచారించిన కోర్టు ప్రవీణ్ నేరం చేసినట్లు నిర్ధారించింది.

కోర్టు తీర్పుపై ప్రజలు, సామాజిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఈ తీర్పు భయం కలిగిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో నిందితుడిపై తరపున ఎవరూ వాదించకూడదని న్యాయవాదులు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రజల మనసులు గెలుచుకున్నారు.

చిన్నారి తల్లిదండ్రులు జగన్, రచన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసముంటున్నారు. జగన్ ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుండగా, రచన గృహిణి. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత పుట్టిన పాపను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. జూన్ నెలలో పాపకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు వేములవాడకు వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో హన్మకొండలోని పాప అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. జూన్ 18వ తేదీన రాత్రి ఇంట్లో ఉక్కపోతగా ఉండటంతో అంతా డాబాపై పడుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రవీణ్ అనే యువకుడు అర్ధరాత్రి వేళ చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప ఏడుస్తుండటంతో చంపేశాడు.

కాసేపటి తర్వాత పాప పక్కన లేని విషయాన్ని గుర్తించిన రచన భర్తతో పాటు తన తమ్ముడిని నిద్రలేపింది. వాళ్లిద్దరితో పాటు ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న కొందరు యువకులు చిన్నారి కోసం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించారు. ఓ చోట పాపను టవల్‌లో చుట్టి తీసుకెళ్లున్న వ్యక్తిని వెంబడించి పట్టుకున్నారు.

పాప జననాంగాల వద్ద తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే వరంగల్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లైంగిక దాడి జరగడంతో చిన్నారి చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితుడు ప్రవీణ్‌ను చితకబాదారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

నిందితుడిపై 366, 302, 376ఎ, 376 ఏబీ, 379 ఐపీసీ సెక్షన్లతో పాటు 5(ఎం) రెడ్‌విత్‌ 6 ఆఫ్‌ పోక్సో యాక్ట్‌ 2012 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రవీణ్‌ను తమకు అప్పగించాలని స్థానికులు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో అతడిని రక్షించేందుకు పోలీసులకు చుక్కలు కనిపించాయి.

అటు వరంగల్ జైలుకు తరలించేందుకు ప్రయత్నించినా అక్కడ ప్రాణాపాయం ఉండటంతో పటిష్ట భద్రత నడుమ ప్రత్యేక గదిలో ఉంచారు. దీనిపై త్వరితగతిన విచారణ చేపట్టిన వరంగల్ జిల్లా కోర్టు అన్ని ఆధారాలు పరిశీలించిన ప్రవీణ్‌ను నేరస్థుడిగా నిర్ధారించింది.

ప్రవీణ్ నేరాన్ని అంగీకరించడంతో జడ్జి జయకుమార్ అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. లాయర్లు ఎవరూ అతని కేసు వాదించేందుకు ముందుకు రాకపోవడంతో పై కోర్టులకి వెళ్ళడం కూడా అనవసరమే.