కాల్వ శ్రీరాంపూర్‌లో టిఆర్ఎస్ నాయకుడిని దుండగులు తుపాకితో బెదిరించిన వైనం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. టిఆర్ఎస్ నాయకుడు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ దేవయ్యను మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు తుపాకీతో హత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన దేవయ్య అగంతకుల చేతిలోని తుపాకీ లాక్కొని బయటికి విసిరి వేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ఇంటి బయటక బురదలో పడటంతో అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఎందుకోసం దేవయ్యపై దాడికి యత్నించారో స్పష్టత లేదు. అయితే దేవయ్యకు స్థానికంగా కొందరితో భూవివాదం ఉన్నట్లు తెలుస్తుంది.
జరిగిన సంఘటనపై సమాచారం ఇవ్వడంతో పోలీసులకు అక్కడి చేరుకుని తుపాకి స్వాధీనం చేసుకున్నారు. భూ వివాదం నేపథ్యంలోనే దేవయ్యను హతమార్చేందుకు వచ్చారా, లేక మావోయిస్టుల కదలికల నేపథ్యంలో దేవయ్య టిఆర్ఎస్ నాయకుడు కావడంతో టార్గెట్ చేసి వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం దేవయ్య ప్రాణ భయంతో పోలీసుల అదుపులో ఉండగా… నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తుపాకితో భయపెట్టడంతో కాల్వ శ్రీరాంపూర్ ప్రజలతో పాటు అక్కడి టీఆర్‌ఎస్ నాయకులు భయాందోళన గురవుతున్నారు.