వరుస విజయాలతో ఆనందంలో ముగినిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. కాగా ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తద్వారా గుజరాత్ స్కోరును కట్టడి చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, అప్పటికే చేతికి గాయమైన కారణంగా సుందర్ తన బౌలింగ్ కోటా పూర్తిచేయలేకపోయాడు. ఇక ఈ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్‌కు గాయం తీవ్రతరమైనందున జట్టుకు దూరం కానున్నాడు.
ఈ విషయం గురించి.. సన్‌రైజర్స్ హెడ్‌కోచ్ టామ్ మూడీ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ… ‘‘వాషింగ్టన్ కుడి చేతి బ్రొటన వేలు, మొదటి వేలుకు మధ్య చీలిక వచ్చింది. రాబోయే రెండు మూడు రోజుల పాటు గాయం తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి. అతడు కోలుకోవడానికి ఓ వారం రోజులు పట్టవచ్చు’’ అని తెలిపాడు. కాగా చెన్నై సూపర్‌కింగ్స్‌పై గెలుపుతో ఐపీఎల్-2022లో బోణీ కొట్టిన ఎస్ఆర్హెచ్.. గుజరాత్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది రెండో విజయం అందుకుంది.