ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ మద్దతు తగ్గిపోతుందని ఒకవైపు హెచ్చరిస్తూనే.. మరోవైపు ఆ దేశానికి తన మద్దతును అమెరికా కొనసాగిస్తోంది. అధ్యక్షుడు బైడెన్ ప్రతినిధిగా టెల్ అవీవ్ వచ్చి.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కలిసిన అమెరికా భద్రతా సలహాదారుడు జేక్ సలివాన్ శుక్రవారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ.. హమాస్‌ను వేటాడే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని స్పష్టం చేశారు. అయితే పౌరుల ప్రాణాలకు ఎక్కువ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పౌరుల ప్రాణాలను హమాస్ మానవకవచాలుగా వాడుకుంటోందని, ఆసుపత్రులు, పాఠశాలల వెనుక దాక్కొని దాడులు చేస్తోందని అన్నారు. మరోవైపు హమాస్ అపహరించిన బందీల్లో ముగ్గురి మృత దేహాలను గాజాలో స్వాధీనం చేసుకున్నా మని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇందులో ఇద్దరు తమ సైనికులు ఉన్నారని తెలిపింది.
మరొకరిని సూపర్ నొవా మ్యూజిక్ ఫెస్టివల్ దగ్గర కిడ్నాపైన వ్యక్తిగా గుర్తించారు. అక్టోబరు 7న గాజా సరిహద్దు ఇజ్రాయెల్ గ్రామాలపై హమాస్ దాడి చేసి 1200 మందిని హత్య చేసి, 240 మందిని అపహరించిన సంగతి తెలిసిందే. తాత్కాలిక సంధిలో భాగంగా కొంతమందిని హమాస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.