మార్చి నెల చివరి వారం వచ్చేసింది. ఇప్పటికే ఎండలు భగభగమంటున్నాయి. ఉదయం పది దాటితే బయటకు వెళ్లడం గగనమవుతోంది. ఇక మధ్యాహ్నం కాలు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రత ఎక్కువవుతోంది. ముఖ్యంగా వచ్చే 4 రోజులూ రాష్ట్రంలో ఎండల తీవ్రత సాధారణం కన్నా 2 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తిమ్మాపూర్‌లో 41.1 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు చెప్పారు. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పటాన్‌చెరులో సాధారణం కన్నా 4.5 డిగ్రీలు పెరగగా.. ఆదిలాబాద్‌లో సాధారణం కన్నా 3.5, హయత్‌నగర్‌లో 3.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.