రాష్ట్రంలో ఫిబ్రవరి ఆరంభంలోనే ఎండలు మొదలయ్యాయి. మొన్నటిదాక చలికి వణికిన ప్రజలు ఇప్పుడు ఎండ సెగకు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వేసవిలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని నగర వాసులు భావిస్తున్నారు.
హైదరాబాద్ లో మంగళవారం రోజున గరిష్ఠంగా మోండా మార్కెట్‌లో 36.3 డిగ్రీలు నమోదైంది. సరూర్‌నగర్‌లో 36.3, బాలానగర్ 35.9, బేగంపేటలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయని వెల్లడించారు. ఈ ఏడాది వేసవిలో ఎండలు ఎక్కువే ఉంటాయనే సంకేతాలు ఆ శాఖ నుంచి వెలువడుతున్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతల పెరుగుదలతో పగలూరాత్రి ఇళ్లలో ఫ్యాన్లు తిరుగుతూనే ఉండటంతో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోందని అధికారులు అంటున్నారు.