Weather Report: రాష్ట్రంలో పెరిగిన చలి..వృద్ధులకు గుండెపోటు, పక్షవాతం ముప్పు

Weather Report: Increased cold in the state..risk of heart attack and paralysis for the elderly
Weather Report: Increased cold in the state..risk of heart attack and paralysis for the elderly

తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పగలు, రాత్రి అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు రావాలన్నా ప్రజలు జంకుతున్నారు. గత నాలుగు రోజులుగా వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. ఈ పరిస్థితి వృద్ధులు, పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడవల్ల చలి తీవ్రతను తట్టుకోవడం కష్టంగా ఉంటుందని తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం తదితర దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి చలి కారణంగా ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రక్తనాళాలు సంకోచించడంతో ముప్పు పెరుగుతుందని.. రక్తనాళాల్లో చిన్న చిన్న బ్లాకులు ఉంటే.. ప్రసరణలో అడ్డంకుల కారణంగా గుండె, మెదడుకు సరఫరా ఆగిపోయి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.