ఉత్తర ప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఖుషీనగర్ జిల్లాలోని నెబువా నౌరంగియా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 11 మంది బావిలో పడి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివాహ కార్యక్రమానికి హాజరయిన వీరంతా బావి స్లాబ్‌పై కూర్చున్నారు. ఈ క్రమంలో అధిక బరువు కారణంగా స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్లాబ్‌పై కూర్చున్న 13 మంది బావిలో పడిపోయారు.
ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో 9 మంది బాలికలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఖుషీనగర్ ప్రమాదంలో మరణించిన వారికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.