లంకకు విండీస్ సవాల్

west indies challenge to srilanka

మిణుకు మిణుకుమంటున్న సెమీస్ ఆశలను నిలుపుకునేందుకు తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడేందుకు శ్రీలంక సిద్ధమైంది. సోమవారం జరిగే పోరులో హోల్డర్‌సేనను ఓడించేందుకు లంక కసరత్తులు చేస్తున్నది. టోర్నీలో వరుస ఓటముల తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్‌పై అనూహ్య విజయంతో ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకున్న కరుణరత్నే సేన..

ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో ఓడి డీలాపడింది. ప్రొటీస్‌తో మ్యాచ్‌లో సమిష్టి వైఫల్యంతో పరాజయం పాలై తీవ్ర ఒత్తిడిలో ఉంది. గత మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైన కెప్టెన్ కరుణరత్నే ఈసారైన భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఆశిస్తున్నాడు. సీనియర్లు మాథ్యూస్, తిషార పెరెరాతో పాటు కుషాల్ పెరెరా, అవిష్క ఫెర్నాండో, ధనంజయ రాణించాల్సిన అవసరం ఉంది. రోచ్, హోల్డర్, థామస్, కాట్రెల్‌తో కూడిన విండీస్ బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే లంక బ్యాట్స్‌మెన్ శక్తికి మించి పోరాడాల్సిందే. బౌలింగ్‌లో మరోసారి మలింగ కీలకం కానుండగా.. లక్మల్, ఉడాన, డిసిల్వా కూడా సత్తాచాటితే జట్టుకు ఎదురుండదు. అనారోగ్యం కారణంగా నువాన్ ప్రదీప్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి రెండు మాత్రమే గెలిచిన(రెండు రద్దు) శ్రీలంక ఆరు పాయింట్లతో ఉంది. విండీస్‌తో సహా తదుపరి మ్యాచ్‌లో భారత్‌పై గెలిచినా సెమీస్‌కు చేరుతుందనే గ్యారెంటీ లేదు.

మరోవైపు పాకిస్థాన్‌పై భారీ విజయంతో టోర్నీని ఘనంగా ఆరంభించిన విండీస్ ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు(ఒకటి రద్దు) ఆడి 3 పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. కొన్ని మ్యాచ్‌ల్లో పోరాడినా కీలక సమయాల్లో ఆటగాళ్లు ఒత్తిడికి లోనవడంతో పరాజయాలను మూటగట్టుకొని సెమీస్‌రేసు నుంచి నిష్క్రమించింది.