ఇటీవల భారత్‌లో జరిగిన జీ-20 సదస్సు, దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకాని విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఈ సమావేశాలకు గైర్హాజరిపై స్పందించారు. తన వల్ల ఆ సదస్సులు పొలిటికల్ షోగా మారతయాని అనిపించిందని.. అలా జరగకూడదని ఆ సమావేశాలకు గైర్హాజరైనట్లు తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన జీ-20, బ్రిక్స్ సదస్సు సమయంలో తన వల్ల తన స్నేహితులకు సమస్యలు రావడం తనకు ఇష్టం లేదని, అందుకే వాటికి దూరంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
మరోవైపు పుతిన్ భారత్, రష్యా మధ్య విభేదాలు సృష్టించేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పశ్చిమ దేశాలు తమ పౌరుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న భారత్‌పై కుట్రలు, కుతంత్రాలు పనిచేయవని అన్నారు. సోచి నగరంలోని రష్యన్ బ్లాక్ సీ రిసార్ట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్.. భారత్ సహా అన్ని దేశాలు ప్రమాదంలోనే ఉన్నాయని.. కానీ, భారత ప్రభుత్వం తమ దేశ ప్రయోజనాల కోసం స్వతంత్రంగా పనిచేస్తోందని చెప్పారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్రమోదీపై పుతిన్ మరోసారి ప్రశంసలు జల్లు కురిపించారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు