తిమింగలం వాంతు విలువ రూ.12కోట్లు

తిమింగలం వాంతు విలువ రూ.12కోట్లు

తిమింగలం పేగుల నుంచి వచ్చే ఘన పదార్థాన్ని (అంబర్‌గ్రిస్‌) ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ముఠాను గుంటూరు జిల్లాలో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి, విజయవాడ, తెలంగాణకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుంచి ఎనిమిది కిలోల అంబర్‌గ్రిస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ పదార్థాన్ని సుగంధ ద్రవ్యాలు, మందులు, ఫెర్ఫ్యూమ్స్‌ తయారీలో వినియోగిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.12కోట్లు ఉంటుందని అంచనా.

కొద్దిరోజుల క్రితం ఓ మహిళ ఫేస్‌బుక్‌లో అంబర్‌గ్రిస్‌ విక్రయానికి పెట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న వైల్డ్‌ లైఫ్‌ క్రైం కంట్రోల్‌ బ్యూరో(డబ్ల్యూసీసీబీ)అధికారులు రంగంలోకి దిగి ఆన్‌లైన్‌లో బేరసారం చేస్తూ ముఠా సభ్యులను ముగ్గులోకి దించారు. కిలో రూ.35లక్షలకు ధర ఇస్తామని చెప్పడంతో వారి మాటలను ముఠా సభ్యలు నమ్మశారు. డబ్బు తీసుకుని నరసరావుపేటకు రావాలని నిందితులు చెప్పడంతో డబ్ల్యూసీసీబీ ప్రత్యేక బృందం అక్కడకు చేరింది. వినుకొండ అటవీ రేంజి అధికారి నీలకంఠేశ్వరరెడ్డి, సెక్షన్‌ అధికారులు సీతారామయ్య, రఘురామిరెడ్డిలతో కలిసి వారిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు.

ప్రధాన నిందితుడు తీగల రాకేష్‌తో పాటు ముఠాలోని మిగిలిన సభ్యులను పల్నాడు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్దకు శనివారం రప్పించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారందరినీ విచారించిన అనంతరం నిందితుల నుంచి ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ఆదివారం కోర్టులో హాజరు పరిచినట్లు మాచర్ల అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రాజు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దర్ని అరెస్టు చేయాల్సి ఉందని వినుకొండ రేంజి అధికారి పేర్కొన్నారు. ఈ కేసులో ఎనిమిది మందికి నరసరావుపేట మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి యు.మాధురి రిమాండ్‌ విధించారు.