అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి…ఎందుకింత రచ్చ ?

what-is-the-original-article-370

జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దుకు ప్రతిపాదన చేస్తున్నట్లు అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 గురించి ముఖ్య విషయాలు ఏంటంటే  జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం చేసిన ఏర్పాటే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలేవీ జమ్మూ కశ్మీర్‌కు వర్తించవు.

దీని ప్రకారమే 1965 వరకూ ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు. ఈ ఆర్టికల్‌ను గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు. ఆయన అంతకు ముందు జమ్మూ కశ్మీర్ రాజు మహారాజా హరి సింగ్ వద్ద దివాన్‌గా పని చేశారు. ఆర్టికల్ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మినహా మిగతా చట్టాల అమలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ఆర్టికల్ 370 ప్రకారం బయటి వ్యక్తులు జమ్మూ కశ్మీర్లో భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయడం కుదరదు. యుద్ధం, విదేశీ దురాక్రమణ సమయంలోనే కేంద్రం ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించగలదు.

అంతర్గత ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేనిదే ఎమర్జెన్సీ విధించలేం. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ ఉన్నాయి. రాష్ట ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్లు.