బండి సంజయ్‌ కలయిక వెనుక స్ట్రాటజీ ఏంటి?

Bandi Sanjay
Bandi Sanjay

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సికింద్రాబాద్‌ రాజరాజేశ్వరి గార్డెన్‌లో రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన కాపు, మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనానికి అతిథిగా హాజరయ్యారు. తనను ప్రోత్సహించిన వారికి, రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడిన వారికి ఈ సందర్భంగా సంజయ్‌ ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణలో ఏ కులం వారు కూడా సంతోషంగా లేరని బండి సంజయ్‌ పేర్కొన్నారు. స్వార్థ కుట్ర రాజకీయాల కోసం కులాలను అడ్డం పెట్టుకునే నాయకులు ఎక్కువగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కులంతో రాజకీయం చేయడం రాజకీయ నాయకుల లక్షణం కాదన్నారు. కుల సంఘాల పేరుతో రాజకీయం మంచిది కాదని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిండంలో భాగంగా రాష్ట్రంలో అన్ని కులాలవారూ అసంతృప్తితో ఉన్నట్లు పేర్కొన్నారు.కరీంనగర్‌ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కాపులు ఎక్కువ. మూడు పర్యాయాలు కాపు సమాజికవర్గానికి చెందిన గంగుల కమలాకర్‌ గెలిచారు. ఈ సారి సంజయ్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో మున్నూరు కాపులు ఎక్కువ. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం వస్తే.. మున్నూరు కాపుల నుంచి అభ్యర్థిని ప్రకటించాలనే ఆలోచనలో సంజయ్‌ ఉన్నట్లు సమాచారం. బీసీని ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. ఇందులో భాగంగానే బీసీలకు పార్టీ పదవుల్లోనూ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే లక్ష్మణ్, ఈటల రాజేందర్, బండి సంజయ్‌కు కీలక పదవులు ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈటలకు చెక్‌ పెట్టేందుకే తాజాగా బండి సంజయ్‌ కాపు కార్డు తెరపైకి తెస్తున్నారని తెలుస్తోంది.