కేంద్రంలో వచ్చేది సంకీర్ణమా? బీఆర్ఎస్ అంచనా నిజమెంత?

BRS
BRS

బిఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) గా మార్చిన తర్వాత దేశంలో గత్తర లేపుతామని కెసిఆర్ అంటున్నారు. అప్పట్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వంటి వారితో చర్చలు జరిపారు. అవేవీ కేసీఆర్ అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు, దీంతో కెసిఆర్ మహారాష్ట్ర మీద దృష్టి సాధించారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయినప్పటికీ ఆయన గొంతులో ఎక్కడ కూడా ఆశావాహ దృక్పథం తగ్గలేదు.. పైగా ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తామని చెబుతున్నారు. కెసిఆర్ ధోరణి ఇలా ఉంటే.. కేటీఆర్ మాట్లాడుతున్న తీరు మరో విధంగా ఉంది.

దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, అందులో బిఆర్ఎస్ కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. కాకపోతే అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమిలో లేని బిఆర్ఎస్ వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో ఎలా కీలకం అవుతుందనేదే ఇక్కడ ప్రశ్న. 2018లో తెలంగాణ రాష్ట్రం మొత్తం గులాబీ గాలి వీచింది. కానీ 2019లో ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. “కారు సారు 16 ” అని నినాదం చేసిన భారత రాష్ట్ర సమితి..9 సీట్లు మాత్రమే గెలిచింది. చివరికి కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయింది. ఇక రాజ్యసభలో భారత రాష్ట్ర సమితి బలం 7 స్థానాలు. మహారాష్ట్రలో ప్రస్తుతం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ విస్తృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ ఏమైనా ఎంపీ సీట్లు గెలుస్తామని ఆశ కేటీఆర్ లో ఉందేమోనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. అయితే మహారాష్ట్రలో ప్రస్తుతం ఎన్సీపీ,శివసేన, కాంగ్రెస్, బిజెపి లు బలంగా ఉన్నాయి.ఇలాంటప్పుడు అక్కడ భారత రాష్ట్ర సమితి ఏ విధంగా ఎంపి స్థానాలు గెలుచుకుంటుందనేది ప్రశ్నగా మిగిలింది.

సంకీర్ణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పడకూడదనే ఉద్దేశంతో బిజెపి “నేషనల్ డెమోక్రటిక్ ఎలయన్స్” పేరిట భాగస్వామ్య పార్టీలతో సమావేశం నిర్వహించింది. తమిళనాడు,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ వంటి బలమైన రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న నేపథ్యంలో.. రేపటి నాడు ఈ పార్టీల చేతిలో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే సరైన ప్రణాళికలు రూపొందించింది. ఎన్నికలకు ఏడాది ముందు ఉందని సరైన సమయంలో సమావేశం నిర్వహించింది. తన కూటమిలోకి ఆహ్వానించింది. ఇలాంటి అప్పుడు బిఆర్ఎస్ కోరుకుంటున్నట్టుగా సంకీర్ణ ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందనేది అంతు పట్టకుండా ఉంది. ఒకవేళ బిఆర్ఎస్ అంచనాల ప్రకారం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే.. ఆ కూటమిలో ఉన్న పార్టీలు కీలకమవుతాయి. ఏ కూటమిలో లేని బిఆర్ఎస్ కీలక అవడం అనేది దాదాపు అసాధ్యం. ప్రస్తుతం కొన్ని పార్టీలు ఏ కూటమిలో లేకుండా ఉన్నాయి.. అయితే వాటి బలం అంతంత మాత్రమే. అవి భారత రాష్ట్ర సమితితో అంటకాగే పరిస్థితులు లేవు. ఇలాంటప్పుడు భారత రాష్ట్ర సమితి అంచనా ఎంతవరకు నిజం అవుతుందనేది వేచి చూడాల్సి ఉంది.