అమ్మ చిరుతా!! ఆచూకీ లక్ష్యం.. ఈసారైనా చిరుత దొరికేనా..?

హైదరాబాద్ శివార్లలో తిరుగుతోన్న ఓ చిరుత అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపుతోంది. గత వారం రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న చిరుతపులి ఆచూకీ ఈరోజు లక్ష్యమైంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్‌సాగర్‌ ఒడ్డున ఉన్న జీవీకే గార్డెన్స్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో చిరుతపులి నీళ్లు తాగుతుండగా వాచ్‌మెన్‌ గమనించారు. ఈ విషయాన్ని వెంటనే అధికారుల చేరవేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు గార్డెన్‌లో కుక్కలను వదిలి చిరుత కోసం గాలిస్తున్నారు.

అదేవిధంగా వ్యవసాయ క్షేత్రంలో బోనుతోపాటు, సీసీ ట్రాప్‌ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. కాగా మే 14న నగర శివారులోని కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద రోడ్డుపై తిరుగుతూ చిరుతపులి కనిపించింది. అటవీశాఖ అధికారులు దానికి మత్తు ఇచ్చే లోపే అది తప్పించుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఫాంహౌస్‌లోకి వెళ్లిన చిరుతపులి, వ్యవసాయ యూనివర్సిటీలోని దట్టమైన పొదల్లో దూరి తప్పించుకుంది. ఈరోజు అటవీశాఖ అధికారు ఆ చిరుతను పట్టుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈరోజైనా ఆ చిరుత దొరికేనా? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.