మన శరీరంలోని అతి పెద్ద గ్రంథి లివర్. మన శరీరంలో మెదడు తర్వాత.. అతి ముఖ్యమైన అవయవం లివర్. ఇది శరీర జీర్ణక్రియ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. రేపు ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుకుంటున్నాం. కాలేయ సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏడాది ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుతున్నారు.మన శరీరంలోని జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని వడపోయడమే లివర్ చేసే ముఖ్యమైన పని.
అంతేకాకుండా ఆహారం ద్వారా వచ్చే రసాయనాలు, వాటిలోని విషపదార్థాలను సైతం లివర్ నిర్మూలిస్తుంది. ముఖ్యంగా శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా లివర్ నియంత్రిస్తుంది. మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తి, జీవక్రియ, పోషకాల సరఫరా, నిల్వ చేయటంలో కాలేయం చాలా అవసరం. దీనిని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే.. మనం ఆరోగ్యంగా ఉంటామని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనం ఏది తిన్నా, తాగినా లివర్ ద్వారానే వెళ్తుంది. కొన్ని ఆహారాలు లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తే.. కొన్ని ఆహారాలు లివర్ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్త తీసుకోకపోతే.. లివర్ ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. లివర్‌కు హాని కలిగించే ఆహారం ఏమిటో చూసేయండి..తెల్ల రొట్టె, పాస్తా, చక్కెర, వైట్ రైస్ వంటివి కూడా కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే వైట్ రైస్‌ని తక్కువగా తీసుకోవాలి. పాలిష్డ్ రైస్ స్థానంలో బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్, క్వినోవా, బార్లీ వంటి తృణధాన్యాలు తీసుకుంటే.. మీ లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఉప్పు లివర్‌పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఉప్పులో సోడియం ఉన్నందున ఎక్కువగా తినకూడదు. రోజుకు 2,300 మిల్లీగ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవాలి. అధిక రక్తపోటు ఉన్నవారు రోజుకు 1,500 మిల్లీగ్రాముల కంటే ఉప్పును తినకూడదు. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు నీరు నిల్వ ఉంటుంది. ఇది కాలేయ వాపుకు దారితీస్తుంది. కాలేయం చుట్టూ కొవ్వు లేదా ఇతర కాలేయ సమస్యలకు దారితీస్తుంది. ఈ కారణంగా ఫ్యాటీ లివర్ రోగులు తక్కువ ఉప్పును తీసుకోవాలని నిపుణులు చూసిస్తున్నారు.
మీకు ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే.. చక్కెరకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. మధుమేహం, ఊబకాయంతో సహా అనేక వ్యాధులకు ఇది కారణం. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంపై నేరుగా ప్రభావం చూపుతుంది. మీరు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, స్వీట్స్, కుకీలు, డ్రింక్స్, ప్రాసెస్డ్ జ్యూస్‌లకు దూరంగా ఉంటే మంచిది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ శాతం ఎక్కువగా పెరుగుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
మైదాతో తయారు చేసిన పాస్తా, పిజ్జా, బిస్కెట్లు, వైట్ బ్రెడ్ లాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. వంటి వీటిలో మినరల్స్, ఫైబర్, విటమిన్లు ఉండవు. ధాన్యాలను ఎక్కువగా రిఫైన్ చేస్తే.. అవి చక్కెర రూపంలోకి మారతాయి. ఆ పిండితో చేసిన ఆహారం తింటే లివర్‌లో కొవ్వు నిలువ ఉండే అవకాశం ఉంది. మైదాతో చేసిన ఆహారం తింటే ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సంతృప్త కొవ్వు ఉన్న ఆహారాలు కాలేయానికి హాని చేస్తాయి. మీగడ పాలు, ఐస్ క్రీమ్, చీజ్ వంటి అధిక కొవ్వుతో ఉన్న పాల ఉత్పత్తులను దూరంగా ఉంచండి. వీటిలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తింటే కాలేయం చుట్టూ కొవ్వు లేదా ఇతర కాలేయ సమస్యలకు దారితీస్తుంది.