చరిత్రకు చేరువలో..

who will win the world cup final match

ఇంగ్లండ్, న్యూజిలాండ్.. 44 ఏండ్ల క్రితం ప్రపంచకప్ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి ఆడుతూ వస్తున్నాయి. ఐదురోజుల ఫార్మాట్‌పై ఎక్కువ దృష్టి పెట్టి పరిమిత ఓవర్ల ఆటను పెద్దగా పట్టించుకోని జట్టు ఒకటైతే.. బరిలో దిగిన ప్రతీసారి ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తూ తమదైన ముద్రవేసిన జట్టు మరొకటి. మూడు సార్లు ఫైనల్ చేరినా.. తుది మెట్టుపై బోల్తా కొట్టిన జట్టు ఒకటైతే.. గత ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓడిన జట్టు మరొకటి. బాదుడుతో పాటు నిత్యవివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే ఇంగ్లిష్ జట్టుకు.. జెంటిల్‌మెన్ ఆటకు నిలువెత్తు రూపంలాకనిపించే బ్లాక్‌క్యాప్స్ వ్యవహార శైలికి అసలు పొంతనే ఉండదు. ఒకరిది దూకుడు, దుందుడుకు స్వభావమైతే.. మరొకరిది నిలకడ, నియంత్రణతో కూడిన ఆటతీరు. ఇంతవరకు ప్రపంచకప్‌ను ముద్దాడని ఈ రెండు జట్లలో ఎవరు గెలిచినా చరిత్రే. ఇన్నేండ్లకు దక్కిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పుట్టింటికి కప్ పట్టుకు రావాలని ఇంగ్లండ్.. ఇంకెన్నాళ్లు సెమీస్ స్టార్‌గా మిగిలిపోవడం ఈసారైనా చాంపియన్‌గా నిలువాలని న్యూజిలాండ్ తాపత్రయ పడుతున్నాయి. మరి ఈ రెండు జట్లలో తొలిసారి కప్పుకొట్టి విశ్వవిజేతగా నిలిచేదేవరో తేలాలంటే ఆదివారం ఫైనల్ ఫైట్ వరకు వేచి చూడాల్సిందే.