జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిని కడతేర్చి పొలంలో పాతిపెట్టారు అతని భార్య, కుమారుడు. ఈ సంఘటన చేవెళ్ల మండలం గుండాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో నెలరోజుల క్రితం గుండాలకు చెందిన క్రిష్ణయ్య అనే వ్యక్తిని అతని భార్య, కుమారుడు హత్య చేశారు. అనంతరం శవాన్ని పొలంలో పాతి పెట్టారు. నెల రోజులుగా క్రిష్ణయ్య కనిపించకపోవటంతో బంధువులు అతని కోసం తీవ్రంగా గాలించారు.
చివరకు క్రిష్ణయ్య కుమారుడిపై అనుమానంతో గట్టిగా నిలదీయటంతో దారుణం బయటపడింది. తానే తల్లితో కలిసి తండ్రిని హత్యచేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. శవాన్ని తమ పొలంలోనే పాతిపెట్టినట్లు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.