ఓ వ్యక్తిని అతడి భార్యే క్రూరంగా హతమార్చిన వైనమిది. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా నార్త్ జోన్ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. సీతానగరం మండలం రఘుదేవపురం యానాదుల కాలనీలో మర్రే అబ్బులు , అతడి భార్య ముత్యాలమ్మ మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఇద్దరూ మద్యం తాగారు. అనంతరం ఇంటి వద్ద గొడవ పడ్డారు. ఇద్దరూ గొడవ పడుతూనే ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి ముత్యాలమ్మ మాత్రమే ఇంటికి వచ్చింది.గురువారం ఉదయం రాపాక రోడ్డులోని ఓ కల్వర్టు వద్ద అబ్బులు మృతదేహాన్ని చూసిన స్దానికులు ముత్యాలమ్మకు సమాచారం ఇచ్చారు.
ఈ క్రమంలో ఆమె తన భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు చేయడానికి శ్మశానవాటికకు తరలించే ప్రయత్నంలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూముకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఎస్సై శుభశేఖర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. తన భర్త ఫిట్స్ వచ్చి చనిపోయాడని వారిని నమ్మించేందుకు ముత్యాలమ్మ ప్రయత్నించింది.మృతదేహాన్ని పరిశీలించగా అబ్బులు మర్మాంగం కట్ చేసి ఉంది. అతడి ముఖంపై కొట్టి హతమార్చినట్టు గుర్తించారు.
దీనిపై తమదైన శైలిలో విచారణ జరిపారు. దంపతులిద్దరూ గొడవలు పడుతూ గ్రామ శివారుకు వెళ్లారని, అక్కడ వాడి పారేసిన మరుగుదొడ్డి బేసిన్‌తో అబ్బులును అతడి భార్య ముత్యాలమ్మ బలంగా కొట్టి ఇంటికి వచ్చేసిందని తెలిపారు. తన భర్త అనారోగ్యంతో మరణించినట్లు చిత్రీకరించేందుకు ఉదయం ప్రయత్నించింది. హత్యకు కారణాలు తెలియాల్సి ఉందని, విచారణ జరుపుతున్నామని డీఎస్పీ తెలిపారు. అబ్బులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముత్యాలమ్మను అదుపులోకి తీసుకుని, హత్య కేసుగా ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు వివాహం జరిగింది.