భర్త మరణవార్త విని భార్య మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బల్లికురవ మండలం చిన అంబడిపూడికి చెందిన చినపాపారావు , భార్య రమాదేవి కి కుమారుడు చంద్రశేఖర్, కుమార్తె సునీత ఉన్నారు. కుమార్తెను అదే గ్రామంలోని మేనల్లుడు రమేష్‌బాబుకు ఇచ్చి వివాహం చేశారు. కుమార్తె, అల్లుడు గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని గణపవరంలో ఉంటున్నారు. కుమారుడు చంద్రశేఖర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ చెన్నైలో ఉంటున్నాడు. రెండేళ్లుగా పాపారావు అనారోగ్యంతో బాధపడుతూ గ్రామంలో ఉండటం లేదు.
పిల్లల దగ్గర ఉంటున్నారు. 15 రోజుల క్రితమే చెన్నై నుంచి భార్యభర్తలు వచ్చి కుమార్తె దగ్గర ఉన్నారు.మంగళవారం తెల్లవారుజామున తనకు ఒంట్లో బాగాలేదని పాపారావు చెప్పడంతో అతనిని వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలోనే వేకువజామున 3 గంటల సమయంలో చనిపోయాడు. పాపారావు మృతి విషయం ఉదయం 5 గంటల సమయంలో ఇంటిదగ్గర ఉన్న అతని భార్య రమాదేవికి చెప్పడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఆమెను హుటాహుటిన చిలకలూరిపేటలోని ఓప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. రెండు గంటల వ్యవధిలోనే భార్య, భర్త ఇద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను చినఅంబడిపూడి తీసుకొచ్చి గ్రామంలో అత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ గ్రామ నాయకుడిగా పాపారావుకు పేరుంది. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చింతల పేరయ్య, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాపారావు, రమాదేవిల మృతదేహాలకు నివాళులర్పించారు.