భర్తను రోకలి బండతో హత్యచేసి, కళ్లుతిరిగి పడిపోయాడని నమ్మించే యత్నంలో తలపై ఉన్న గాయాలు చూసి మృతుడి అన్న ఫిర్యాదుతో బండారం బట్టబయలైన ఘటన తాడికొండలో చోటుచేసుకుంది. మంగళగిరి రూరల్ సీఐ భూషణం కథనం మేరకు.. తాడికొండకు చెందిన చిలకా రమేష్ కు అదే గ్రామానికి చెందిన నిర్మలతో పదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. తాడికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో గార్డుగా విధులు నిర్వహిస్తున్న రమేష్‌కు ఐదేళ్ల క్రితం పక్షవాతం వచ్చి కోలుకున్నాడు.
అయితే అప్పటి నుంచి కుటుంబంలో కలహాలు రేగుతుండటం పరిపాటిగా మారి గతంలో రెండుసార్లు భార్య తనపై హత్యాయత్నం చేసిందని మృతుడు రమేష్ తన అన్నకు చెప్పాడు.ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో వివాదం జరిగిన క్రమంలో భార్య నిర్మల భర్తను రోకలితో తలపై గట్టిగా కొట్టడంతో స్పృహతప్పి పడిపోయాడు. దీనిని కప్పిపుచ్చుకునే క్రమంలో శనివారం ఉదయం కళ్లుతిరిగి పడిపోయాడంటూ నాటకం ఆడి 108 వాహనం ద్వారా గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9:30 గంటలకు చనిపోయాడు.
ఆదివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా అనుమానం వచ్చిన అన్న శవాన్ని చూడగా తలపై గాయం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి రూరల్ సీఐ భూషణం మృతుడి భార్య, అమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయగా నిజం ఒప్పుకుంది. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా మృతుడి సోదరుడు చిలకా దాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భూషణం తెలిపారు.