తీవ్ర రూపం దాల్చిన చిన్న చిన్న విభేదాలు

తీవ్ర రూపం దాల్చిన చిన్న చిన్న విభేదాలు

భార్యాభర్తల మధ్య నెలకొన్న చిన్న చిన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చి చివరికి ఒకరి హత్యకు దారితీశాయి. తాళ్లరేవు మండల పరిధిలోని గాడిమొగ పంచాయతీ లక్ష్మీపతిపురం గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి అప్పారావు(32)ను అతని భార్య దేవి గొడ్డలితో నరికి చంపడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన అప్పారావుతో ఐ.పోలవరం మండలం కొమరగిరి గ్రామానికి చెందిన దేవి అలియాస్‌ భవానీకి పదేళ్ల క్రితం వివాహం జరిగింది.

వారికి పదేళ్ల కుమార్తె ఆదిలక్ష్మి, ఎనిమిదేళ్ల కుమారుడు రాము ఉన్నారు. అప్పారావుకు దేవి మేనత్త కూతురు. కొన్నినెలలుగా వేరే కాపురం పెట్టమంటూ భర్తను అడుగుతోంది. అప్పారావు ఒకడే కుమారుడు కావడం తల్లి, చెల్లి బాధ్యత తనపై ఉండడంతో దానికి ససేమిరా అనేవాడు. దీంతో తరచూ గొడవలు పడేవారు. గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయిన దేవిని గ్రామ పెద్దలు ఒప్పించడంతో వారం రోజుల క్రితం ఇంటికి వచ్చింది.

రొయ్యల కంపెనీలో పనిచేసే అప్పారావును అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించారని, అప్పుల భారం అధికంగా ఉండడంతో భార్యను ఉద్యోగానికి వెళ్లాలని పట్టుబట్టినట్లు సమాచారం. ఆదివారం ఉదయం తల్లి సత్యవతి, చెల్లి దుర్గాదేవి రొయ్యల పరిశ్రమలో పనికి వెళ్లిన అనంతరం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో అప్పారావు హత్యకు గురయ్యాడు. పిల్లలు లేచి చూసేసరికి తండ్రి నెత్తుటి మడుగులో ఉండడం, తల్లి కనిపించకపోవడంతో బయటకు పరుగులు తీశారు.

అప్పారావు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఉదయం 11 గంటల ప్రాంతంలో కోరంగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరంగి ఎస్సై ఎస్‌.రాము ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ డీఎస్పీ వి.భీమారావు, కాకినాడ రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ నిద్రలో ఉన్న అప్పారావు తలను దేవి గొడ్డలితో ఘోరంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. నిందితురాలు దేవి పరారీలో ఉందని ఆమెపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.