వారిద్దరూ పాత నేరస్తులే… భర్త బయట, భార్య జైలులో ఉండేది. ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని సహించలేక అతనినే కడతేర్చింది. పోలీసులకు అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించింది. వివరాలు.. చెన్నైకి చెందిన ప్రభాకరన్, సుకన్య(32) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. చెన్నైలో మనీ బ్యాక్ స్కీమ్ ప్రారంభించిన ప్రభాకరన్ 2012లో ఆర్థిక నేరాలకు పాల్పడటంతో సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయన జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రభాకరన్ భార్య సుకన్య కూడా అదే కేసులో ఐదు సంవత్సరాలు జైలుకు వెళ్లి వచ్చింది. భర్త సమాచారం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరిలో బంధువుల వద్ద పిల్లలతో కలిసి ఉంటోంది.
జైలు నుంచి వచ్చిన ప్రభాకరన్ మౌలాలి ఆండాళ్ నగర్‌లో నివాసముంటున్నాడు. చర్చి పాస్టర్‌గా, సంఘ సేవకుడిగా పనిచేసేవాడు. రెండేళ్ల కిత్రం పక్షవాతం రావడంతో తనకు తోడుగా ఒక మహిళను కేర్ టేకర్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. భర్త సమాచారం తెలుసుకున్న సుకన్య పది రోజుల కిత్రం భర్త వద్దకు పిల్లలతో కలిసి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత భర్తతో పాటు మరో మహిళ ఉండటంతో భర్త మీద అనుమానం వచ్చింది. దీంతో కేర్‌టేకర్‌ను మాన్పించింది. కేర్ టేకర్‌ను రప్పించాలని భార్యతో ప్రభాకరన్ గొడవపడుతున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను, పిల్లలను చంపుతానని ప్రభాకరన్ బెదిరిస్తున్నాడు.
ఈ నెల 23వ తేదీ రాత్రి కేర్‌టేకర్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సుకన్య దిండుతో భర్త మొహం మీద ఒత్తి హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి మరుసటి రోజు ఉదయం ఆమెనే 100 నంబర్‌కు కాల్ చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు చేయడానికి సుకన్య నిరాకరించడం, సంఘటన స్థలంలో కొన్ని వస్తువులు అనుమానాస్పదంగా కనిపించడంతో సుకన్యను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం అంగీకరించింది. ఈ నేపథ్యంలో శనివారం ఆమెను రిమాండ్‌కు తరలించాము’ అని ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి వెల్లడించారు.