ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడితో హతుడి భార్య వివాహేతర సంబంధం గుట్టు ఈ హత్యతో బట్టబయలైంది. ధార్వాడ జిల్లా హుబ్లీ తాలూకా అంచటగేరి నివాసి అక్షతకు హావేరి జిల్లా హానగల్ నివాసి జగదీష్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నాలుగు నెలల క్రితం అక్షతకు ఓ మగబిడ్డ జన్మించింది. ఈక్రమంలో భార్య, బిడ్డలను చూడటానికి వచ్చిన భర్త దారుణ హత్యకు గురయ్యాడు.
ఈ కేసు కూపీ లాగిన సీఐ రమేష్ గోకాక్ అక్షత కాల్ డేటాను తెలుసుకొని ఆమె ప్రియుడు కాశప్పను అదుపులోకి తీసుకుని పోలీసు పద్ధతిలో విచారించగా అసలు విషయం నిగ్గు తేలింది. అక్షత ప్రియుడు కాశప్ప స్వగ్రామం బాదామి తాలూకా బండకేరి. ఇతడు గత ఐదేళ్ల నుంచి కేఈబీ లైన్మెన్గా ఉంటూ అంచటగేరిలో అక్షత ఇంటి ఎదుట ఇల్లు తీసుకొని ఉండేవాడు. వీరి మధ్య గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం నెలకొంది. అంతేగాక నాలుగు నెలల క్రితం కాశప్పకు మరో యువతితో వివాహమైంది.
తమ వివాహేతర సంబంధం కొనసాగాలంటే అడ్డుగా ఉన్న భర్త జగదీష్‌ను చంపేయాలని ఇద్దరూ పథకం వేశారు. ఆ క్రమంలోనే భార్య, బిడ్డను చూసేందుకు వచ్చిన జగదీష్‌కు మంగళవారం కాశప్ప మందుపార్టీ ఇచ్చి ఊరు చివరలోని చెన్నాపుర క్రాస్ వద్ద తలపై బండరాయిని ఎత్తి వేసి హత్య చేసి పరారయ్యాడు. కొన్ని గంటల్లోనే కేసు మిస్టరీని చేధించిన పోలీసులు గురువారం నిందితులను జుడీషియల్ కస్టడీకి అప్పగించారు.