కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. అనుమానంతో భార్యను ఉరేసి చంపాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. ఈ సంఘటన మహేశ్వరం మండల పరి ధిలోని మాణిక్యమ్మగూడలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…కందుకూరు మండలం చిప్పలపల్లికి చెందిన అల్వాల నర్సింహకు మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడకు చెందిన లక్ష్మమ్మ అలియాస్ మంగమ్మ తో 2005లో వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే నర్సింహ అత్తగారి ఊరికి మకాం మార్చాడు. దంపతులిద్దరూ అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
నర్సింహ మేస్త్రి, డ్రిల్లింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం భార్య ఫోన్‌కు గుర్తు తెలియని కాల్ రావడాన్ని గమనించిన నర్సింహ.. అప్పటి నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరు ఫోన్ చేస్తున్నారని నిత్యం వేధించేవాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇదే విషయమై భార్యతో గొడవ పెట్టుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి మరోసారి గొడవకు దిగాడు. కోపోద్రిక్తుడై క్షణికావేశంలో విద్యుత్ వైర్‌తో లక్ష్మమ్మ మెడకు ఉరి బిగించి హత్య చేశాడు.
అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికాడు. ఏమీ ఎరగనట్లు చుట్టుపక్కల వారికి తన భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. మృతురాలి తల్లికి అనుమానం వచ్చి మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. తమదైనశైలిలో విచారించారు. దీంతో తానే హత్య చేసినట్లు నర్సింహ నేరం అంగీకరించాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుసూదన్ తెలిపారు.