Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని, ప్రతి వ్యక్తిగత అంశాన్నీ ఆధార్ తో ముడిపెట్టం సరికాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చి రెండు రోజులైనా గడవకముందే మరో దిగ్భ్రాంతికర విషయం వెలుగుచూసింది. మన దేశ ప్రజల ఆధార్ డేటా మొత్తం అమెరికా గూఢాచార సంస్థ సీఐఏ చేతుల్లోకి వెళ్లిపోయిందని వికీలిక్స్ సంచలన ప్రకటన చేసింది. సీఐఏ ఓ ప్రత్యేక టూల్ సాయంతో ఆధార్ డేటాను రహస్యంగా తెలుసుకుందని వివరిస్తూ…వికీలీక్స్ ఓ డాక్యుమెంట్ ప్రచురించింది. ట్విట్టర్ లో ఈ డాక్యుమెంట్ ను షేర్ చేసింది. దీని ప్రకారం అమెరికాకు చెందిన క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ తయారు చేసిన ఎక్స్‌ప్రెస్ లేన్ అనే టూల్ ను సీఐఏ ఉపయోగిస్తోంది. దీని సాయంతో క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ కు అనుసంధానంగా ఉన్న సర్వీసుల నుంచి డేటాను రహస్యంగా తెలుసుకోవచ్చని వీకీలీక్స్ తన డాక్యుమెంటులో పొందుపరిచింది.
ఈ క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ కు మన ఆధార్ కూ లింకుంది. ఆధార్ నమోదు కోసం ఉపయోగించిన బయోమెట్రిక్ పరికరాలను క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ తయారుచేసింది. అలా మన సమాచారం మొత్తం క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ కు అనుసంధానం అయిందన్నమాట. ఎక్స్ ప్రెస్ టూల్ ద్వారా అమెరికా ఆ సమాచారం మొత్తాన్ని తస్కరించింది. ఈ వార్తల నేపథ్యంలో దేశ పౌరుల సమాచార భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఇలాంటి ప్రమాదాలు ఉంటాయని గ్రహించే ఆధార్ కార్డు నమోదు చేయటాన్ని…బ్యాంక్ ఎకౌంట్, సిమ్, పాన్ కార్డ్ ఇలా అన్నింటీకీ ఆధార్ ను లింక్ చేయటాన్నీ తొలి నుంచీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. గత యూపీఏ ప్రభుత్వం ఆధార్ నమోదును ప్రారంభించిన కొన్ని రోజులకే ఈ సమాచారం మొత్తం అమెరికా చేతుల్లోకి వెళ్లిపోతోందన్న వాదనలు వినిపించాయి. అది చాలదన్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం దైనందిన జీవితంలోని ప్రతి అంశాన్నీ ఆధార్ తో లింక్ చేయటానికి ప్రయత్నించటంతో భారతీయుల వ్యక్తిగత భద్రత ప్రమాదంలో పడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో అనేక కేంద్ర పథకాలకు ఆధార్ ను లింక్ చేయటం అనే పద్ధతి సందిగ్ధంలో పడినా…ఇప్పటిదాకా సేకరించిన సమాచారం భద్రత ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం డేటా ప్రొటక్షన్ కోసం నిపుణులతో కమిటీ వేశామని, ఆధార్ డేటా సురక్షితమే అని చెప్పుకుంటూ వస్తోంది.
ఆధార్ డేటాను తాము పూర్తిగా ఎన్ క్రిప్ట్ చేస్తామని, యూనిక్ ఐడింటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా తప్ప మరే ఇతర ఏజెన్సీ కూడా దాన్ని డీక్రిప్ట్ చేయలేదని అధికారులు చెబుతున్నారు. క్రాస్ మ్యాచ్ సంస్థ కేవలం బయోమెట్రిక్ పరికరాలు సరఫరా చేసే సంస్థ మాత్రమే అని, ఇతర విషయాలతో దానికి సంబంధం లేదని వారు స్పష్టంచేశారు. కానీ వికీలీక్స్ బయటపెట్టిన డాక్యుమెంట్లతో భారత ప్రభుత్వ వాదన నిజం కాదని దేశ ప్రజలు ఎక్కువమంది భావిస్తున్నారు. దీనికి కారణం అమెరికా గతంలోనూ క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ ను ఉపయోగించటం. ఈ టెక్నాలజీ ద్వారానే అమెరికా 2011లో పాకిస్థాన్ లో సీక్రెట్ ఆపరేషన్ చేపట్టి ఒసామాబిన్ లాడెన్ ను హతమార్చినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. దీన్ని బట్టి చూస్తే…మన ఆధార్ డేటా మొత్తం క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ ద్వారా అమెరికా చేతుల్లోకి వెళ్లిపోయిందన్న వాదనలు నిజమే అనిపిస్తుంది.
మరిన్ని వార్తలు: