కిరాతకంగా ఐదుగురు హత్య

కిరాతకంగా ఐదుగురు హత్య

మండ్య జిల్లా శ్రీరంగపట్టణం తాలూకా కేఆర్‌ఎస్‌ గ్రామంలో ఈనెల 6న కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మైసూరు తాలూకా బెలవెత్త గ్రామానికి చెందిన సునీల్‌ భార్య లక్ష్మిని నిందితురాలిగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. జిల్లా ఎస్పీ ఎన్‌.యతీశ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. గంగారామ్‌ భార్య లక్ష్మి , ఆమె ముగ్గురు పిల్లలు రాజ్‌ , కోమల్‌, కునాల్‌ , అన్న కుమారుడు గోవింద హత్యకు గురైన విషయం తెలిసిందే. నిందితురాలు లక్ష్మి, మృతురాలు లక్ష్మి ఇద్దరూ వరుసకు అక్కాచెల్లెళ్లు.

నిందితురాలు లక్ష్మికి మృతురాలి భర్త గంగారామ్‌ అంటే ఇష్టం. మృతురాలు లక్ష్మిని గంగారామ్‌ నుంచి దూరం చేసేందుకు వారి మధ్య గొడవలు సృష్టించేందుకు నిందితురాలు ప్రయత్నించి విఫలమైంది. దీంతో గంగారామ్‌ భార్యను చంపేయాలని నిర్ణయానికి వచ్చింది. బెలవెత్త గ్రామంలోని చికెన్‌ షాపులో కత్తిని తీసుకుని శనివారం రాత్రి గంగారామ్‌ ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి వరకు లక్ష్మితో గొడవ పడింది. తెల్లవారుజామున మూడు గంటలకు కత్తితో లక్ష్మపై విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేసింది.

నిద్ర లేచి ఏడుస్తున్న పిల్లలు అదే కత్తితో అంతమొందించింది. మృతదేహాలపై బ్లాంకెట్‌ పరిచి ఇంట్లో బీరువాలో ఉన్న దుస్తులను చెల్లాచెదురుగా పడేసి దొంగతనం జరిగినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అనంతరం తన దుస్తులను వేరే చోట ఉంచి వేరే ఏదో వాహనంలో స్వగ్రామానికి వెళ్లింది. మరుసటి రోజు రోదిస్తూ అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి తన ఇంటికి చేరుకుంది. కత్తిని శుభ్రంగా కడిగి అదే చికెన్‌ షాపులో అప్పగించింది. పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా హత్యోదంతానికి పాల్పడినట్లు అంగీకరించింది.