దేశ‌రాజ‌ధానిలో ఓ మ‌హిళ‌కు ఘోర అవ‌మానం

woman assaulted paraded in delhi by liquor mafia

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏదో ఓ కార‌ణం చూపి ఓ మ‌హిళ‌పై తోటి మ‌హిళ‌లు దాడిచేయ‌డం సాధార‌ణంగా మారుమూల గ్రామాల్లో క‌నిపిస్తుంటుంది. చ‌దువు, సంస్కారం, నాగ‌రిక‌తా తెలియ‌ని మ‌హిళ‌లే ఇలాంటి దాడులు చేస్తార‌నుకుంటాం. కానీ అత్యాధునిక పోకడ‌లు ఉండే దేశ‌రాజ‌ధానిలోనూ ఇలాంటి త‌ర‌హా మ‌హిళ‌లు ఉన్నార‌ని రుజువ‌యింది. త‌మ అక్ర‌మ వ్యాపారాన్ని బ‌య‌ట‌పెట్టింద‌న్న అక్క‌సుతో ఓ మ‌హిళ‌పై ఇత‌ర మ‌హిళ‌లు అమానుష దాడి చేశారు. ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా కొట్టి…ఆమెను న‌గ్నంగా ఊరేగించారు. అంత‌టితో ఆగ‌కుండా ఆ దారుణాన్నంతా చిత్రీకిరించి సోష‌ల్ మీడియాలోనూ షేర్ చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై ఢిల్లీలో తీవ్ర ఆగ్ర‌హ‌జ్వాల‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వివ‌రాల్లోకి వెళ్తే… ఢిల్లీలోని న‌రేలా ప్రాంతానికి చెందిన కొంద‌రు మ‌హిళ‌లు అక్ర‌మంగా మ‌ద్యం వ్యాపారం చేస్తున్నారు. విష‌యం తెలుసుకున్న అదే ప్రాంతానికి చెందిన ప్ర‌వీణ అనే మ‌హిళ దీనిపై ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ కు స‌మాచారమిచ్చింది. దీంతో పోలీసులు గురువారం రాత్రి ఆ ప్రాంతంలో సోదాలు జ‌రిపి, ఓ ఇంటి నుంచి 300 మ‌ద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మ‌ద్యం విక్ర‌యానికి పాల్ప‌డ్డ మ‌హిళ‌ల‌కు తీవ్ర ఆగ్ర‌హం వ‌చ్చింది. పోలీసులు అలా వెళ్లగానే వారంతా క‌లిసి త‌మ గురించి స‌మాచారం ఇచ్చిన మ‌హిళ‌పై దారుణానికి ఒడిగ‌ట్టారు. ఆ మ‌హిళ‌ను ఇనుప‌రాడ్ల‌తో కొట్టి, దుస్తులు చించేసి న‌గ్నంగా ఊరేగించారు.

ఈ దారుణంపై ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. బాధితురాలు ప్ర‌వీణ.. ఘ‌ట‌న గురించి మాట్లాడుతున్న వీడియోను మ‌హిళాక‌మిష‌న్ చీఫ్ స్వాతి మ‌లివాల్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. లిక్క‌ర్ మాఫియాకు వ్య‌తిరేకంగా మాట్లాడతావా అంటూ కొంద‌రు త‌న‌ను బెదిరిస్తూ త‌న‌పై దాడిచేశార‌ని ఆమె తెలిపింది. రోడ్డు మీద‌కు లాక్కొచ్చి కొట్టార‌ని, దుస్తులు చించివేశార‌ని, అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన ఓ పోలీసును కూడా కొట్టార‌ని బాధిత మ‌హిళ ఆ వీడియోలో చెప్పింది. అయితే దీనిపై పోలీసుల స్పంద‌న భిన్నంగా ఉంది.

మ‌హిళ‌పై దాడి జ‌రిగిన మాట నిజ‌మేన‌ని, కానీ ఆమెను న‌గ్నంగా ఊరేగించ‌లేద‌ని వారు చెబుతున్నారు. పోలీసుల వివ‌ర‌ణ‌ను త‌ప్పుబ‌ట్టిన మ‌హిళా క‌మిష‌న్ పోలీస్ శాఖ‌కు నోటీసులు జారీచేసింది. బాధితురాలు ప్ర‌వీణ డీసీడ‌బ్ల్యూ వాలంట‌రీగా ప‌నిచేస్తోంద‌ని, ఆమెకు అవ‌మానం జ‌రిగిన మాట వాస్త‌వ‌మ‌ని స్వాతి మ‌లివాల్ చెప్పారు. అటు ఈ ఘ‌ట‌న‌పై ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత దిగ్భ్రాంతిక‌ర‌, సిగ్గుప‌డాల్సిన ఘ‌ట‌న అని, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజాల్ ను కోరారు.