భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళ మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రామ్రెడ్డిపల్లికి చెందిన జంపాల లక్ష్మమ్మ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎన్టీఆర్నగర్ కూరగాయల మార్కెట్లో పని చేస్తూ… పరిసర ప్రాంతాల్లోనే నివాసముంటుంది. రెండేళ్ల క్రితం లక్ష్మమ్మ పెద్ద కుమార్తె ధనమ్మ(20)కు తన బంధువు సురేష్తో వివాహం జరిపించింది.
కానీ భార్యభర్తల మద్య వచ్చిన మనస్పర్థలతో మూడు నెలల క్రితం వారు విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ధనమ్మ మానసికంగా కుంగిపోయి బాధపడుతూ ఉండేది. సోమవారం తెల్లవారు జామున మార్కెట్ నుంచి వచ్చి ఆమె తల్లి, సోదరి ఇంటి తలుపులు ఎంతగా తట్టినా ధనమ్మ తలుపులు తీయలేదు. దీంతో తలుపులు పగులగొట్టి చూడగా ధనమ్మ ఇంటి పైకప్పుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్మకు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి మృతురాలి తల్లి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.