ఓ మహిళ దారుణహత్యకు గురైన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ కె.బాలరాజు వివరాల ప్రకారం.. చింతల్ భగత్‌సింగ్ నగర్‌కు చెందిన ముప్పిడి మల్లేష్, స్వరూప(48) భార్యాభర్తలు. మల్లేష్ సనత్‌నగర్‌లో టైలర్‌షాపు నిర్వహిస్తుండగా భార్య సరస్వతి ఇంట్లోనే టైలరింగ్ చేస్తోంది. వీరి ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు ఇంజినీరింగ్ పూర్తి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం కుమారుడు హరిబాబును తన ద్విచక్రవాహనంపై ఐడీపీఎల్‌లో దింపి మల్లేష్ సనత్‌నగర్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం మల్లేష్ భార్య స్వరూపతో ఫోన్లో మాట్లాడాడు. సాయంత్రం మరోమారు ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదు.
రాత్రి 8గంటలకు మల్లేష్ ఇంటికి వెళ్లేసరికి ఇంటి తలుపులు మూసి బయట నుంచి గడియ పెట్టి ఉంది. మల్లేష్ తలుపులు తెరిచి లోపలికి వెళ్లేసరికి బెడ్రూమ్లో పడిఉన్న స్వరూప నోరు, కళ్లలో రక్తం కనిపించింది. ఆమె అప్పటికే మృతి చెంది ఉండగా తల పక్కనే టవల్ ఉంది. బంగారు పుస్తెలతాడుతో పాటు కాళ్ల పట్టగొలుసులు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి చూడగా బీరువా తలుపులు తెరిచి చూడగా.. 11 తులాల బంగారంతో పాటు 10 తులాల వెండి, రూ.50 వేల నగదు కనిపించలేదు. మల్లేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.