ఆడపిల్లలనే కంటోందని.. అత్తామామలు కోడలిని తీవ్రంగా వేధించారు. ఒక మగబిడ్డకు జన్మనివ్వడం లేదనే ఆగ్రహంతో కోడలిని దారుణంగా హత్య చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. శివపురి జిల్లా దిండోలి గ్రామానికి చెందిన సావిత్రి భగేల్, రతన్‌సింగ్ భార్యాభర్తలు. ఇంతకుముందే ముగ్గురు ఆడపిల్లలు ఉండగా ఇటీవల సావిత్రి నాలుగో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది.
దీంతో భర్త రతన్‌సింగ్, అతడి తల్లిదండ్రులు కిలోల్డ్ సింగ్, బేను భాయ్ తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. ఆడపిల్లలను కనడంపై తీవ్రంగా దూషిస్తూ దాడి చేస్తుండేవారు. తాజాగా నాలుగో బిడ్డ కూడా ఆడపిల్ల కావడంతో సావిత్రిని గురువారం భర్తతో పాటు అత్తామామ ఆమె గొంతు నులిమి హత్య చేశారు.
తన సోదరి మృతి చెందడంపై సావిత్రి సోదరుడు కృష్ణ భగేల్ అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్తామామ, భర్త చేసిన అఘాయిత్యం బయటపడింది. దీంతో రతన్‌సింగ్, కిలోల్డ్ సింగ్, బేను భాయ్‌లను అరెస్ట్ చేశారు. పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం తన సోదరిని వేధించేవాడని కూడా అతడు పోలీసులకు చెప్పాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.