మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ కానిస్టేబుల్ మెడలోని చైన్‌ను దొంగిలించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సన్‌సిటీలో నివాసం ఉండే ఈశ్వర్ ప్రసాద్ ఏఆర్ కానిస్టేబుల్. ఈ నెల 12న రాత్రి 8:30 సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రీన్‌ల్యాండ్స్ వద్ద ఓ యువతి లిఫ్ట్ అడగగా ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు.
రాత్రి 9 గంటలకు ఆమెను పంజగుట్టలో దింపి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో స్నానం చేసే సమయంలో తన బంగారు గొలుసు మాయమైనట్లు తెలుసుకున్నాడు. పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితురాలు మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా ఇలానే దొంగతనం చేసేందుకు యత్నించగా అక్కడి పోలీసులు ఆమెను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
విచారణ చేయగా పంజగుట్టలో కానిస్టేబుల్ వద్ద కూడా చైన్ కొట్టేసినట్లు తెలిపింది. కాగా ఆమె ట్రాన్స్‌జెండర్‌గా పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన అంజూన్ అని నిర్ధారించారు. అంజూన్ బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వచ్చి దొంగతనాలు చేసి తిరిగి వెల్లిపోతుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.