ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది గడవకముందే అత్తింటి వేధింపులకు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన నెల్లూరు నగరం ఎన్‌టీఆర్ నగర్ చర్చి వీధిలో చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఉలవడపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన జె.లక్ష్మికి మానస (28), మౌనిక, మహేంద్ర ముగ్గురు పిల్లలు. ఆమె కూలి పనులు చేసుకుంటూ పిల్లలను ఉన్నత చదువులు చదివించింది.
పెద్ద కుమార్తె మానస పద్మావతి విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ధనలక్ష్మిపురంలోని నారాయణ విద్యా సంస్థలో జూనియర్ లెక్చరర్‌గా చేరారు. నెల్లూరు రూరల్ మండలం మాదరాజగూడూరుకు చెందిన మానికల చినబాబు అక్కడే వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మానస, చినబాబు నడమ ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఏడాది కిందట వీరు వివాహం చేసుకున్నారు.
మాదరాజగూడూరులో కాపురం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మానస తల్లి మాదరాజ గూడూరు చేరుకుని తన కుమార్తెను బాగా చూసుకోమని అల్లుడు చినబాబుకు విన్నవించి వెళ్లింది. వివాహమైన కొంతకాలం నుంచే అత్తింటి వారు కట్నం కోసం ఆమెను వేధించడం ప్రారంభించారు. భర్త సైతం వారికి వత్తాసు పలకడంతో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. కొద్ది నెలల అనంతరం చినబాబు, మానస నెల్లూరు రామ్‌నగర్‌కు మకాం మార్చారు.
రెండు నెలల కిందట అక్కడి నుంచి ఎన్‌టీఆర్ నగర్ చర్చి వీధిలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. మానస తన ఉద్యోగాన్ని మానేసి ఏపీ సెట్‌కు సిద్ధమవుతోంది. చినబాబు యాక్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల రెండో తేదీ సాయంత్రం దంపతుల నడుమ చిన్నపాటి ఘర్షణ జరిగింది. చినబాబు ఇంటి వెనుక వైపునున్న గదిలో ఉండగా మానస తన గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కాసేపు తర్వాత చినబాబు తలుపులు తట్టినా తీయకపోవడంతో కిటీకీలో నుంచి చూడగా మానస ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికులతో కలిసి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే మానస మృతి చెంది ఉంది. ఈ విషయంపై స్థానికులు గురువారం అర్ధరాత్రి బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం మానస తల్లి నెల్లూరుకు చేరుకుని కన్నీటి పర్యంతమైంది.
బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ జి.మంగారావు తన సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. తహసీల్దార్ వచ్చి మృతదేహానికి శవపంచనామా చేశారు. భర్త, అత్తమామ, ఆడబిడ్డలు తన కుమార్తె మృతికి కారణమని మానస తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతురాలి భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం జీజీహెచ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ మంగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.