చెరువులో దూకి యువతి ఆత్మహత్య

చెరువులో దూకి యువతి ఆత్మహత్య

మనస్తాపానికి గురై చెరువులో దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భువనగిరి మండల పరిధిలోని రాయగిరి చెరువు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని లాలాపేటకు చెందిన బసవరాజు, భారతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. వీరిలో గీతారాణి  ఎంబీఏ పూర్తిచేసి ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది.

వరంగల్‌ కాజీపేటకు చెందిన టి. విజయ్‌కుమార్‌తో గీతారాణికి గతంలో నిశ్చితార్ధం అయ్యింది. డిసెంబర్‌ 9, 2020న పెళ్లి తేదీ నిర్ణయించారు. కాగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి అబ్బాయి వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. అప్పటి నుంచి గీతారాణి డిప్రెషన్‌లోకి వెళ్లింది. బుధవారం మధ్యాహ్నం బ్యాంక్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుల్దేరిన గీతారాణి సాయంత్రం 4 గంటల తర్వాత కుటుంబ సభ్యులు ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు.

కాగా రాత్రి భువనగిరిలోని రాయగిరి చెరువు కట్ట మీద యువతి చెప్పులు, ఆధార్‌కార్డు పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధార్‌కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. గురువారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టగా, చివరికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల సహయంతో మధ్యాహ్నం చెరువులో నుంచి గీతారాణి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్సై సైదులు తెలిపారు.