బంధువులైన ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకుని.. వివాహం చేసుకుని జీవితాంతం కలిసుండాలని భావించారు. తమ ప్రేమ విషయం ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు తెలియజేశారు. పిల్లల ఇష్టాలను గౌరవించిన పెద్దలు.. వారి పెళ్లికి పచ్చజెండా ఊపారు. తల్లిదండ్రులు అంగీకరించడంతో ప్రేమికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇక్కడే వారి జీవితాలను విధి మలుపుతిప్పింది. తానొకటి తలిస్తే.. దైవం వేరొకటి తలుస్తాడన్నట్టు కాబోయేవాడు ప్రమాదవశాత్తూ బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. అతడులేని లోకంలో తానూ ఉండలేనని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని కలబుర్గిలో శుక్రవారం చోటుచేసుకుంది. కలబుర్గిలోని పీడబ్ల్యుడీ క్వార్టర్స్‌కు చెందిన శ్రుతి తన సమీప బంధువైన బసవనబాగేవాడికి చెందిన హనుమంత అనే యువకుడిని ప్రేమించింది. బంధువులే కావడంతో వీరి ప్రేమకు పెద్దలు ఆశీర్వాదం లభించింది. ఇద్దరికీ వివాహం జరిపించేందుకు రెండు కుటుంబాల పెద్దలూ అంగీకరించారు.
ఈ క్రమంలో గత నెల హనుమంతు ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి శ్రుతి తీవ్ర మనస్తాపానికి గురైంది. తనను ఒక్కదాన్నే వదిలేసి వెళ్లిపోయాడని కలత చెందిన శ్రుతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా మారిన కుమార్తెను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఘటనపై సమాచారం అందుకున్న స్టేషన్ బజార్ పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇరు కుటుంబాల్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన చుట్టుపక్కలవారిని తీవ్రంగా కలచివేసింది.