మండలంలోని గుడ్యాణంపల్లెకు చెందిన బి.సుబ్రమణ్యం పెద్ద కుమారుడు కిశోర్ తిరుపతి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగి. స్విమ్స్‌లో నర్స్‌గా పనిచేస్తున్న నీరజ (32)తో పరిచయం ఏర్పడింది. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. తిరుపతిలో నివాసముంటున్న మేనమామ అనిల్ చేరదీసి, ఇంటర్ వరకు చదివించాడు.
నర్స్ ట్రైనింగ్ పూర్తిచేయించి, స్విమ్స్‌లో చేర్పించాడు. ఈ క్రమంలో కిశోర్‌తో నీరజకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తిరుపతిలో కాపురం పెట్టారు.
వీరికి చందు(8), చైత్ర (2) పిల్లలున్నారు. కరోనా కారణంగా గత ఏడాది గుడ్యాణంపల్లెకు వచ్చారు. అప్పటి నుంచి తల్లిదండ్రులతో ఉంటున్నారు. కిశోర్ కాంట్రాక్ట్ ఉద్యోగం వదిలేసి పెనుమూరు మండలంలో కోళ్ల ఫారాలు లీజుకు తీసుకొని వ్యాపారం చేస్తున్నాడు. నీరజ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో డ్యూటీకి వెళ్లి వచ్చేది. కిశోర్ భార్యకు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉండడంతో అనుమానం పెంచుకున్నాడు.
గత ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేయించాడు. నీరజ ఇంట్లో ఒంటరిగా ఉండలేక పోయింది. తిరుపతికి వెళ్లి కాపురం పెడదామని భర్తను పదేపదే కోరింది. దీనికి భర్తతో పాటు అత్తమామలు వ్యతిరేకించారు. ఈ విషయం గొడవకు దారితీసింది. గత శనివారం రాత్రి నీరజ భర్త, అత్త మామలతో గొడవ పడింది. నీరజపై వారు చేయి చేసుకున్నారు.
మనస్తాపం చెందిన ఆమె ఆదివారం తెల్లవారు జామున తన ఇద్దరు బిడ్డలను తీసుకొని స్కూటీలో అత్తింటి నుంచి వెళ్లిపోయింది. భార్య, బిడ్డలు కనిపించడం లేదని భర్త ఆదివారం పెనుమూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం ఉదయం రామచంద్రాపురం మండలానికి చెందిన ఓ క్వారీ గుంతలో నీరజతో పాటు ఇద్దరు బిడ్డల మృత దేహాలు తేలాయి.
రామాపురం చెత్త సేకరణ కేంద్రం వద్ద స్కూటీని పార్కింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉపాధి కూలీలు అటువైపు వెళ్లగా మృతదేహాలు కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారమే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. రామచంద్రాపురం ఎస్ఐ జయ స్వాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు.