కామారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి కాకుండానే తల్లైన యువతి అప్పుడే పుట్టిన బిడ్డను ముళ్ల పొదల్లో పడేసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గాంధారి మండలం బీర్మల్ తండాలోని దుర్గం చెరువు వద్ద మంగళవారం ముళ్లపొదల్లో నుంచి బిడ్డ ఏడుపును విన్న స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. తల్లి గర్భంలో నుంచి అప్పుడే బయటికొచ్చిన నవజాత శిశువు ఆ పరిస్థితుల్లో చూసి చలించిపోయి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న గాంధారి ఎస్ఐ, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి సరస్వతి శిశువును కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నవజాత శిశువును పరీక్షించిన డాక్టర్ శ్రీనివాస్ శిశువును అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రాంతంలోని బావిలో ఓ మహిళ మృతదేహాన్ని కొందరు గుర్తించగా పోలీసులు వెలికితీశారు. ఆమెను స్థానికులు గుర్తించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన ఆమె బిడ్డకు జన్మనిచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు.