వివాదాల్లో హీరో విశాల్

వివాదాల్లో హీరో విశాల్

విశాల్ నటుడిగా దక్షిణ సినీ పరిశ్రమలోమంచి పేరుంది. ఈయన నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన చక్ర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈయనకు స్థానిక వడపళని, కుమరన్∙కాలనీలోని చిత్ర నిర్మాణ కార్యాలయం ఉంది. అందులో పది మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. నటుడు విశాల్ కొంత కాలంగా ఆదాయ పన్నుశాఖ సంస్థకు టీడీయస్‌ను చెల్లించడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ఆరా తీయగా తన కార్యాలయంలో రూ.45 లక్షలు మోసం జరిగిందన్న విషయం వెలుగు చూసిందట. విశాల్ కార్యాలయ నిర్వాహకుడు హరి స్థానిక సాలిగ్రామంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.

అందులో తమ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేసే రమ్య ఈ మోసానికి´పాల్పడినట్టు పేర్కొన్నారు. తాను ఆదాయ శాఖకు చెల్లించాల్సిన టీడీయస్‌ను రమ్య ఆమె భర్త బ్యాంక్‌ అకౌంట్లు,తన బంధువుల బ్యాంకు అకౌంట్‌లోకి తరలిందని పేర్కొన్నారు. కాబట్టి ఆమెను విచారించాలని కోరారు. ఈ విషయం అలా ఉంటే రమ్య నటుడు విశాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఒక ఛానల్‌తో మాట్లాడుతూ.. విశాల్ కొన్నేళ్లుగా ప్రభుత్వానికి టీడీయస్‌ను చెల్లించకుండా మోసానికి పాల్పడుతున్నారని, దాని నుంచి తప్పిచుకోవడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. విశాల్ కార్యనిర్వాహకుడు హరి వర్గం తన ఇంటికి వచ్చి బెదిరించిందని వెల్లడించింది. విశాల్‌కు సంబంధించిన చాలా విషయాలు తనకు తెలుసని చెప్పింది. తనకు పోలీసులు రక్షణ కలిస్తే నటుడు విశాల్‌కు సంబంధించిన మరిన్ని రహస్యాలను బయట పెడతానని రమ్య పేర్కొంది. ఈ వ్యవహారం కోలీవుడ్‌లో కలకలం సృష్టింది.